
కట్టను తవ్వి, చేపట్టిన పునాది నిర్మాణం
ధర్మారం: మండలంలోని ఎర్రగుంటపల్లి శివారు ఎర్రకుంట శిఖం భూమిలో అక్రమంగా ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆదేశాలతో యజమాని పనులు నిలిపివేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఎర్రకుంట శిఖం భూమి సమీపంలో పట్టా భూములున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇక్కడ పట్టా భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పటికే ఒక ఫంక్షన్‌హాల్ నిర్మించాడు. ఇటీవల ఎర్రకుంట సమీపంలో మరో ఫంక్షన్‌హాల్ పనులు ప్రారంభించాడు. పునాది కోసం కుంట కట్టను కొంతభాగం తవ్వించాడు. అంతేకాకుండా, గతంలో మత్తడి ఉన్న స్థలాన్ని సైతం పూర్తిగా కబ్జాచేసి, పనులు చేయిస్తున్నాడు. దీనిపై గ్రామస్తుల ఫిర్యాదుతో ఇరిగేషన్ అధికారులు వర్క్ ఇన్‌స్పెక్టర్ సదన్‌ను మంగళవారం ఎర్రకుంట వద్దకు పంపించారు. కట్ట కొంతభాగాన్ని, మత్తడి స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆయన అనుమానించారు. విషయాన్ని ఆయన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సదరు యజమానికి ఫోన్ చేసి, పనులు ఆపాలని ఆదేశించడంతో నిలిపివేశారు. కాగా, ఎర్రకుంటకు హద్దులు నిర్ణయించాలని, కట్ట వరకు దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.
ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
నిలిపివేయించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment