● పరిస్థితి విషమం
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో మంగళవారం ప్రమాదం జరిగింది. పీసీ పటేల్ ప్రైవేట్ ఓబీకి చెందిన వాహనం ఢీకొట్టడంతో ప్రైవేట్ బోలెరో నడుపుతున్న అంశాల శ్రావణ్ అనే ఎంవీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్వారీలోని ఫోర్‌సీమ్ ఏరియాలో ఆ వాహనానికి సాంకేతిక సమస్య తలెత్తడంతో డ్రైవర్ ఆపి, పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో ప్రైవేట్ ఓబీకి చెందిన తుఫాన్ వాహనాన్ని డ్రైవర్ రివర్స్‌లో తీసుకువచ్చి, ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో శ్రావణ్ ప్రక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.