
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిత్వం మా సారుకే వస్తదంటే.. మా నేతకే ఇస్తున్నట్టు చెప్పిండ్రు అంటూ పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న నేతల అనుచరులు ఎవరికి వారే చెప్పుకున్నరు. మరో నాయకుడు కొంతకాలం క్రితమే మరో ముఖ్య నేతతో కలసి చేరి టికెట్ కోసం తనవంతు యత్నాలు చేశారు. తొలి జాబితాలో తన పేరు వస్తుందంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. వాళ్లకు కాదు.. మాలో ఎవరికై నా పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశమిస్తేనే కాషాయ కండువా కప్పుకుంటామంటూ మరో ఇద్దరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. పెద్దపల్లి సీటు కేటాయింపుపై సమాలోచనల్లో భాగంగా పెద్దపల్లి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకుడితో ఫోన్‌లో రాష్ట్ర ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మాట్లాడడంతో టికెట్ నాకే వచ్చింది.. పాత విషయాలన్నీ మర్చిపోయి ఈ ఎన్నికల్లో అందరం కలసి పని చేద్దామంటూ ప్రత్యర్థి వర్గీయుల్లో ఉన్న వారితోనూ మాట్లాడానని సదరు నేత మనోవేదనకు గురవుతున్నారట. పెద్దపల్లికి చెందిన యువ నాయకుడు రాష్ట్రస్థాయి నేత టికెట్ ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడంటూ ప్రచార రథాన్నే సిద్ధం చేసుకున్నాడు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో చాలాకాలంగా ఉంటున్న ఈ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు తనకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారైందని చెప్పడంతో ఆయన అనుచరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇలా ఎవరికి వారు తమ నేతకు టికెట్ వస్తుందనని ఆశగా ఎదురుచూశారు. పార్టీ అధిష్టానం మాత్రం నామినేషన్ వేసే ఆఖరు రోజున ఆలయంలో పూజలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు టికెట్ కేటాయించగా.. ఆయన తన నామినేషన్ కూడా పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆఖరుగా దాఖలు చేశారు. కాగా తనకు టికెట్ వచ్చిందని చెప్పి.. ప్రత్యర్థి వర్గీయుడికి టికెట్ కేటాయించడంతో ఆ నేతతో పాటు ఆయన వర్గీయులు గుర్రుగా ఉండి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు పెద్దపల్లిలో మంగళవారం సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.