పార్వతీపురం: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణతో పాటు గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్ర యాలను అరికట్టేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆపరేషన్ త్రిశూల్, ఎన్‌కార్డ్ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పై చర్యలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అంబులెన్స్, క్రేన్ సేవల అందుబాటుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యాసంస్థలు, కళాశాలలు, వసతిగృహాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈగల్ క్లబ్‌లను చురుగ్గా పనిచేయించాలని తెలిపారు. పునరావృత నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సీతంపేట: ీసతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సవర విజయ్‌నందన్ (12) పచ్చకామెర్లతో బాధపడుతూ శ్రీకాకుళం రిమ్స్‌లో శుక్రవారం మృతిచెందాడు. ఈ నెల 23న కడుపునొప్పి తీవ్రంగా రావడంతో పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథ మ చికిత్స అనంతరం వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ అక్కడి వైద్యులతో మాట్లాడి శస్త్ర చికిత్స చేయించారు. అనంతరం బాగానే ఉంది. దీంతో అక్కడే ఉండి వైద్యసేవలు పొందుతున్నాడు. గురువారం ఊహించని విధంగా ప్లేట్‌లెట్స్, పల్స్ పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరాడు. వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోయింది. విద్యార్థిది సీతంపేట మండలంలోని నౌగూడ గ్రామం. తల్లిదండ్రులు శ్రీను, కుమారి వ్యవసాయకూలి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమార్తె డిగ్రీ చదువుతోంది. చిన్నకుమారుడు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. హెచ్‌ఎం టి.చంద్రరావు, డిప్యూటీ వార్డెన్ బెన్నయ్య,ఉపాధ్యాయ సిబ్బంది కుటుంబాన్ని పరామర్శించి మృతునికి కు టుంబానికి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సీతానగరం: సంకిలిలోని ఈఐడీ–ప్యారిస్ (ఇండియా) లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో 2026– 27 క్రషింగ్‌ను డిసెంబర్ 3న ప్రారంభిస్తామని సీనియర్ జనరల్ మేనేజర్ టి.వెంకటసూర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌లో చెరకు టన్నుకు రూ.3,383 మద్దతు ధర గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. క్రషింగ్‌కు రైతులు సహకరించాలని కోరారు. చెరకు కోత, రవాణా, సరఫరా షెడ్యూల్ తదితర వివరాల కోసం సమీపంలోని కర్మాగార సిబ్బంది, క్షేత్ర అధికారులను సంప్రదించాలని సూచించారు.
పార్వతీపురం రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వు సిబ్బందికి, ఏకగ్రీవ పంచాయతీల ఉద్యోగ, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ చెల్లించాలని యూటీ ఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లాశాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారికి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు, జిల్లా కోశాధికారి కె.మురళి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందిస్తూ, రిజర్వు, ఏకగ్రీవ పంచాయతీల సిబ్బందికి చెల్లింపుల కోసం నిధులు కేటాయించామని తెలిపారు. ఎంపీడీఓల నుంచి సమాచారం తీసుకుని చెల్లింపులు కాని వారికి అందేలా చూస్తామన్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్వోలకు తగిన స్థాయిలో రెమ్యూనరేషన్ చెల్లించేందుకు పై అధికారులకు విన్నవించామని, ఆదేశాలు వచ్చిన వెంటనే చెల్లింపులు చేస్తామని తెలిపారు.


