గుమ్మలక్ష్మీపురంలో 14 ఎంపీటీసీ ప్రాదేశికాల్లో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి చెరో 7 స్థానాలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ టీడీపీకి మద్దతునిస్తూ ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరు
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు టీడీపీ అభ్యర్థులు ఎంపికయ్యారు. వాస్తవంగా మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలుండగా... వైఎస్సార్‌సీపీకి 7, టీడీపీకి 7 చొప్పున స్థానాలు వచ్చాయి. లాటరీ ప్రక్రియలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎంపిక చేయాలి. అయితే, పి.ఆమిటి ప్రాదేశికానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు గురువారం జరిగిన ఎన్నికకు గైర్హాజరయ్యాడు. ఆయనను ప్రలోభాలకు గురిచేసినట్టు సమాచారం. దీంతో టీడీపీకి చెందిన బిడ్డిక పద్మావతి ఎంపీపీగా, సొంటేన రమ్య వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. పి.ఆమిటి ఎంపీటీసీ సభ్యుడు మూటక లక్ష్మయ్య ఎన్నికలో పాల్గొంటేనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని, లేకుంటే వాయిదా వేయాలనివె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. స్పష్టమైన కోరం ఉండడంతో ఎన్నిక వాయిదా వేయడం కుదరదంటూ ప్రిసైండింగ్ అధికారి ఎన్నికను నిర్వహించారు. కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగధీశ్వరి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎల్.శ్రీనివాసరావు, బి.రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన
కొనుగోలు చేసి దాచిపెట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ లక్ష్మయ్యను హాజరుపరచాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఎమ్మెల్యే జగదీశ్వరిని అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే డౌన్‌డౌన్, ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరశన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయం వరకూ టీడీపీ ఎంపీటీసీల వాహనాన్ని అనుమతివ్వడం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు తమకో రూలు టీడీపీ వాళ్లకో రూలా అంటూ పోలీసులను ప్రశ్నించారు.


