విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి
పార్వతీపురం రూరల్: కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలిక లకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాలికలు త్వరగా కోలుకునేలా అవసరమైన అన్ని వైద్యపరమైన చర్యలు సత్వరమే చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గుమ్మలక్ష్మీపురం:
కురుపాం మండలం శివన్నపేట వద్ద గల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల బాలికలపై విషజ్వరాలు పంజావిసిరాయి. కొద్దిరోజులుగా వణికిస్తున్నాయి. సుమారు 80 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. గురువారం జరిగిన ఈ సంఘటన బయటకు పొక్కనీయకుండా అక్కడి సిబ్బంది సుమారు 50 మంది విద్యార్థినులను కురుపాంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకుండా మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసేవలందించారు. శుక్రవా రం ఈ సమాచారం బయటకు పొక్కడంతో.. పాఠశాల సిబ్బంది కేవలం నాలుగైదు మంది విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారని చూపే ప్రయత్నం చేసినప్పటికీ.. రెండు గదుల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉంచి వైద్య సేవలు అందిస్తుండడం మాజీ డిఫ్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పాఠశాల పర్యటనతో బయటపడింది. దీంతో పలువుర్ని కురుపాం సీహెచ్‌సీకి వైద్యం నిమిత్తం తరలించారు. అన్ని సౌకర్యాలున్న కురుపాం సీహెచ్‌సీలో కాకుండా దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లి విద్యార్థులకు వైద్య సేవలందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదుపులో ఉన్న జ్వరాలు
కురుపాం గురుకుల పాఠశాలలో జ్వరాల పరిస్థితి అదుపులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మేరకు విద్యార్థుల అస్వస్థతౖపై డెరెక్టర్ పబ్లిక్ హెల్త్, జిల్లా అధికారులతో ఆరా తీసిన ఆరోగ్య మంత్రి కురుపాం గురుకుల పాఠశాలలో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారన్నారని, 38 మంది విద్యార్థినులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాలకు చెందిన 516 మంది విద్యార్థినులకు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 515 మందికి నెగెటివ్ వచ్చిందని, ఒకరికి మలేరియా పాజిటివ్ వచ్చిందన్నారు.
జ్వరం, విరేచనాలు, జలుబు,దగ్గు, తలనొప్పి లక్షణాతో అస్వస్థత
80 మందికిపైనే బాధితులు
పీహెచ్‌సీలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యసేవలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ఇదే పాఠశాలలో గతేడాది అనారోగ్యంతో ఇద్దరు విద్యార్థినుల మృతి
సుమారు 200 మంది వరకూ అస్వస్థత


