నేడే ఓటరు తీర్పు..! | - | Sakshi
Sakshi News home page

నేడే ఓటరు తీర్పు..!

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

382 మందితో పోలీసు బందోబస్తు

● ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

● ఉదయం 8గంటల నుంచి ప్రారంభం

● నాలుగు నియోజకవర్గాల్లోని కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 మండలాలకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. గురువారం నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో 67.12 శాతం పోలింగు నమోదైంది. 6,43,875 ఓట్లకు గాను 4,32,161మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల తీర్పు ఏమిటో.. మరి కాసేపట్లో తేలనుంది. పురపాలక సంఘాల ఎన్నికల మాదిరి.. పరిషత్‌ ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఆగడాలు హెచ్చుగా సాగాయి. పచ్చ మూకలు బరి తెగించి రిగ్గింగుకు పాల్పడ్డాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో దౌర్జన్యాలకు తెగబడ్డాయి.

పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరగనుంది.

పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పాలకొండ డిగ్రీ కళాశాల మొదటి బ్లాక్‌లో చేపట్టనున్నారు.

సాలూరు నియోజకవర్గానికి చెందిన సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సాలూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జరగనుంది.

కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కురుపాం, జీఎల్‌ పురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉల్లిభద్ర దరి ఉద్యాన కళాశాలలో జరగనుంది.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. నాలుగు నియోజకవర్గాల స్థాయి కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 382 మంది పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐ/ఆర్‌ఐలు, 20 మంది ఎస్సైలు, 219 మంది కానిస్టేబుల్స్‌, 123 హోం గార్డ్‌ సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలోని సంబంధిత పోలీసు స్టేషన్ల ద్వారా మూడంచెల భద్రతా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement