విజయనగరం అర్బన్: మహారాజా అటానమస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో మహారాజాస్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ కన్సల్టెన్సీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించి, అధికారిక లోగోను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడం ఈ కేంద్రం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎన్‌ఈటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ మహాపాత్రో మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయంతో విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం, వాస్తవిక ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్‌రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సాంబశివరావు, విభాగాధిపతి ఎల్.పి.నాయుడు, సమన్వయకర్త కె.సింధుష తదితరులు పాల్గొన్నారు.


