మూడు రోజుల నిర్బంధం తరువాత | - | Sakshi
Sakshi News home page

మూడు రోజుల నిర్బంధం తరువాత

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

సాలూరు: జైలులో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, పోలింగ్‌ సమయంలో నిర్బంధంలో ఉంటూనే గెలిచిన అసెంబ్లీరౌడీ సినిమాను తలపించేలా చేసింది పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్లు వేసిన కొఠియా వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిషత్‌ ఎన్నికలకు కొఠియా గ్రూప్‌ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ సెగ్మెంట్‌ ఉంది. ఈ సెగ్మెంట్‌కు వైఎస్సార్‌సీపీ తరఫున మజ్జి కనుపూరు,టీడీపీ తరఫున చిరంజీవి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ ఎన్నికలు జరగకుండా ఒడిశా ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. అదే సమయంలో ఈ నెల 3న ఇద్దరు అభ్యర్థులను మాట్లాడాలని పిలిచి ఒడిశా పోలీసులు సిమిలిగుడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వారి వెంట మరో ముగ్గురిని తీసుకువెళ్లారు. అది ఒడిశా భూభాగమని, అక్కడ ఆంధ్రా ఎన్నికలకు ఎందుకు నామినేషన్లు వేశారని మొత్తం ఆ ఐదుగురిని ప్రశ్నించారు. అయితే ఇవి వివాదాస్పద గ్రామాలని రెండు రాష్ట్రాల నుంచి మాకు ఓటు హక్కులు ఉన్నాయని రేషన్‌ సరుకులు తీసుకుంటున్నామని వారు బదులిచ్చారు. అక్కడి నుంచి కొరాపుట్‌కు వెళ్తున్నామని చెప్పి, కొరాపుట్‌ దాటిన తరువాత వారు ఐదుగురిని ఎక్కడో తెలియని ఓ ప్రదేశంలో వేర్వేరుగా రెండు గదుల్లో ఉంచారు. సమయానికి భోజనం పెట్టారు. బయటకు వెళ్లకుండా ఉంచారు. వారు అక్కడ ఉండగానే ఈ నెల 5న పోలింగ్‌ జరిగింది. మూడు రోజుల నిర్బంధం తరువాత శుక్రవారం వారిని విడిచిపెట్టగా సాయంత్రానికి వారు తమ గ్రామాలైన కొఠియా గ్రామాలకు చేరుకున్నారు.

కుటుంబసభ్యుల నిరీక్షణ

మూడు రోజులుగా ఇంటి వద్ద అభ్యర్థుల కోసం నిరీక్షిస్తున్న వారి కుటుంబసభ్యులు అభ్యర్థులను చూసి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకే రక్షణ కల్పించడంలో ఈ ఆంధ్రా కూటమి ప్రభుత్వం విఫలం కాగా, ఒడిశా ప్రభుత్వం దూకుడు, దౌర్జన్యం కొఠియా గ్రామాల్లో పరాకాష్టకు చేరాయని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. పోలింగ్‌ సమయంలోనైనా కనీసం కూట మి అభ్యర్థినైనా ఒడిశా ప్రభుత్వ నిర్బంధం నుంచి బయటకు తీసుకురాలేకపోవడం, ఎట్టకేలకు ఒడిశానే అభ్యర్థులను విడిచిపెడితే తప్ప వారు బయటకు రాని పరిస్థితి స్థానిక మంత్రి సంధ్యారాణి, కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమంటూ పలువురు గిరిజనులు, నాయకులు విమర్శిస్తున్నారు.

కొఠియా ఎంపీటీసీ అభ్యర్థుల విడుదల

పోలింగ్‌ సమయంలో అభ్యర్థులను నిర్బంధించిన ఒడిశా ప్రభుత్వం

అభ్యర్థులకే రక్షణ ఇవ్వలేకపోయిన ఆంధ్రాప్రభుత్వంపై గిరిజనుల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement