పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ జులుం రెచ్చిపోయిన పచ్చమూకలు
పలుచోట్ల వైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు
జిల్లాలో 67 శాతం పోలింగు నమోదు
మక్కువ పోలింగు కేంద్రంలో పోలీసులతో వాగ్వాదం
పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో చెల్లాచెదురు చేస్తున్న పోలీసులు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/భామిని/మక్కువ/పాలకొండ రూరల్: జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఓటరు స్వేచ్ఛగా ఓటేసేందుకు భయపడేలా వాతావరణాన్ని సృష్టించాయి. యథేచ్ఛగా దాడులకు తెగబడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకున్నాయి. సరిపడా పోలీసు బందోబస్తు లేకపోవడం..ఉన్నవారు సైతం చేతులెత్తేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏజెంట్లు శివాలెత్తారు. రిగ్గింగుకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో దర్జాగా ప్రవేశించి, ఓట్లు గుద్దేసుకున్నారు. నిలువరించిన వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. వెంటాడి, తరమి కొట్టారు.
జిల్లాలోని 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు 799 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ సాగింది. సుమారు 900 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిపడా పోలీసు దళాలు లేకపోవడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తం 6,43,874 మంది ఓటర్లు ఉండగా.. పోలింగు ముగిసే సమయానికి 4,31,422 (67 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా సీతంపేట మండలంలో 71.47 శాతం..అత్యల్ప ంగా భామినిలో 60.10 శాతం నమోదైంది. ఎన్నిక ల వేళ విశాఖ, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వలస జీవులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివచ్చారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. కొంతమంది అభ్యర్థులు రాను, పోను చార్జీలిస్తామంటూ ఓటర్లను స్వప్రాంతాలకు రప్పించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చమూకలు బరితెగించాయి. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, దాడులతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించాయి.
●బలిజిపేట మండలం చిలకలపల్లిలో పోలింగు కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే జోగారావును తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. తన సొంత గ్రామం.. ఓటేసేందుకు వచ్చానని ఆయన చెప్పినా తగ్గలేదు. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. అజ్జాడలోనూ వైఎస్సార్సీపీకి ఓటేస్తే బ్లేడుతో కోస్తా.. అంటూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి భయభ్రాంతులకు గురి చేశాడు.
●పార్వతీపురం మండలం పుట్టూరు పోలింగ్ కేంద్రంలోనూ వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లతో టీడీపీ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కేంద్రం వెలుపల తోపులాట జరిగింది. కేంద్రం వద్ద ఆరంభంలో పోలీసు బందోబస్తు కరువైంది. కేవలం మహిళా పోలీసుల పర్యవేక్షణలోనే పోలింగ్ ప్రక్రియ సాగింది. ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. పెద బొండపల్లిలోనూ ఇదే తరహాలో ఘర్షణ జరిగింది.
●వీరఘట్టం మండలం బిటివాడ హైస్కూల్ పోలింగు కేంద్రంలో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఏజెంట్ దగ్గర ఉండి ఓట్లు వేయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
●మక్కువలో మంత్రి సంధ్యారాణి తన కాన్వాయ్‌తో పోలింగు కేంద్రంలోపలికి వచ్చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని చిత్రీకరిస్తున్న ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు బయటకు పంపేశారు. ఆయన్ను అరెస్టు చేయాలని మంత్రి సంధ్యారాణి పోలీసులకు సూచించా రు.ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా మక్కువలో టీడీపీ మూకలు అత్యుత్సాహం చూపాయి. సుమా రు ఎనిమిది మంది టీడీపీ గుండాలు ఓ విలేకరిపై దాడికి ప్రయత్నించారు. ఇతర మీడియా ప్రతినిధులను సైతం దుర్భాషలాడి, సెల్ఫోన్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపైన కూడా బెది రింపులకు దిగారు. పోలింగ్ కేంద్రంలోపలే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేశారు. పోలీసులు అడిగితే.. ఓటేసేందుకు వచ్చామంటూ బుకాయించారు. వారు వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడే కొనసాగి దగ్గరుండి ఓట్లేయించుకున్నారు.
●భామిని మండలం కీసరలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. కోసలి నుంచి వచ్చిన ఓ వ్యక్తితో కీసరలో ఓటేయించేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నించాయి. దీన్ని వైఎస్సార్సీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి రావడంతో వివాదం ముదిరింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో టీడీపీ అల్లరి మూ కలు దాడులకు తెగబడ్డాయి. పోలీసులు జోక్యం చే సుకుని లాఠీచార్జి చేయడంతో చెల్లాచెదురయ్యారు.
●పాలకొండ మండలం టీడీపారాపురంలో కూట మి నాయకులు రిగ్గింగుకు పాల్పడ్డారు. ఓటర్లను భయపెట్టి, వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు లాగేసి, ఇష్టానుసారం పోలింగు చేసుకున్నారని ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ అభ్యర్థిని టి.కల్ప న ఫిర్యాదు చేశారు. ఈ కేంద్రంలో 470 ఓట్లకు గానూ 366 ఓట్లు ఒకేసారి వేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పొట్లి గ్రామంలో కూటమి ఏజెంట్లు .. ఓటర్లను అడ్డుకుని వారే ఓట్లు వేయడానికి ప్రయత్నించారు. లుంబూరులో జనసేన అభ్యర్థి, టీడీపీ రెబల్ అభ్యర్థి మధ్య వాగ్వాదం జరిగింది.
కొమరాడ మండలం దేవకోన పి.హెచ్ .4 లో ఏపీవోగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కొండగొర్రి ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే సిబ్బంది, ఏజెంట్లు ఆటోపై స్థానిక రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఎన్నికల నిర్వహణ అన్ని పోలింగు కేంద్రాల్లో ఒకేలా ఉండాలి. జిల్లాలో మాత్రం వేర్వేరుగా సాగింది. దీనివల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కేంద్రాల వద్ద బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వాటి ఎదురుగా వారి గుర్తులు కనిపించినట్లు ఉంచినా.. మరికొన్ని చోట్ల గుర్తులు లేవు సరికదా.. పేర్లు కూడా కనీకనిపించని విధంగా ఉన్నాయి. కొమరాడ మండలంలో ఉలిపిరి, దేవకోన, పెద్ద శాఖ గ్రామాల్లో ఇటువంటి పరిస్థితిని స్థానిక సీపీఎం నాయకులు ప్రశ్నించారు. జిల్లాలోని చాలాచోట్ల పోలింగు కేంద్రాల వద్ద సరిపడా సౌకర్యాలు లేవు. ఓటేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బారిని ఓటేయించేందుకు తీసుకొస్తున్నామని బుకాయించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్న ఘటనలు పలు చోట్ల వెలుగుచూశాయి.


