● పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యావసరాల మంటలు | - | Sakshi
Sakshi News home page

● పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యావసరాల మంటలు

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

● పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యావసరాల మంటలు ● సామాన్య కుటుంబాల బడ్జెట్‌కు తప్పని కోతలు ● కూటమి పాలనలో ధరలకు రెక్కలు ● రెండున్నరేళ్ల పాలనలో ధరల కట్టడికి చర్యలేవీ? రెండున్నరేళ్లలో ధరలు రెట్టింపు పేదల పళ్లెంలో తగ్గుతున్న పోషకాహారం

● సామాన్య కుటుంబాల బడ్జెట్‌కు తప్పని కోతలు

ఎన్నికలకు ముందు నిత్యావసర ధరలతో పాటు విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అదుపు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేస్తోంది. పప్పులు, ఉప్పులు, గ్యాస్‌, వంటనూనెల ధరలు ఆకాశా న్ని అంటుతున్నాయి. కిలో బియ్యం రూ.100 ఉంటే ఎకరా భూమి 99 పైసలకు కూటమి నాయకులు ఇచ్చేస్తున్నారు. పేదలను ఆదుకోవడంలేదు. సంపన్నులు ఇచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులు చౌకగా కట్టబెడుతోంది. పెరుగుతున్న ధరలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కనీసం ఎన్నికల హామీలు అమలుచేసినా కాస్త వెసులుబాటు ఉండేది. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబపోషణ భారంగా మారింది...ఇదే కూటమి తీరు. –విశ్వాసరాయి కళావతి,

మాజీ ఎమ్మెల్యే, పాలకొండ

సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్‌/పార్వతీపురం రూరల్‌: నిత్యావసరాల ధరల పెరుగుదల పార్వతీపురం మన్యం జిల్లాలోని సామాన్య కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కూరగాయల నుంచి పప్పులు, నూనెల వరకు రోజువారీ అవసరాల కోసం ఖర్చు పెరుగుతుండటంతో నెలవారీ కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలు.. ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆదాయం పెరగకపోగా.. మరోవైపు మార్కెట్‌లో ధరలు అదుపుతప్పుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా నిత్యావసరాల ధరల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి తగ్గుదల వంటి కారణాలు ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం సామాన్యులపై పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024కు ముందు ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,400 నుంచి రూ.2,200– 2,400కు చేరింది. పాలు లీటరు రూ.44 నుంచి రూ.59కి, పంచదార కిలో రూ.40 నుంచి రూ.75, కందిపప్పు రూ.110 నుంచి రూ.170కి పెరిగింది. కోడిగుడ్డు ధర రూ.5 నుంచి రూ.7, పెట్రోల్‌ రూ.109 నుంచి రూ.118, డీజిల్‌ రూ.94 నుంచి రూ.104, టమాటా ధర రూ.20 నుంచి రూ.45, మినపప్పు ధర రూ.120 నుంచి రూ.145 అయ్యింది. ఉల్లిపాయలు, శనగపప్పు, చింతపండు.. ఇలా ఏ ధర చూసుకున్నా రెట్టింపు అయ్యింది. వంటనూనె 15 కిలోల టిన్‌ ధర రూ.2,000 నుంచి రూ.2,800కు పెరిగింది. చికెన్‌ కిలో రూ.180 నుంచి రూ.300కు, మాంసం రూ.800 నుంచి రూ.1,000కు చేరాయి. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.820 నుంచి రూ.950కి పెరిగింది.

ధరల పెరుగుదల ప్రభావం కేవలం కుటుంబ ఖర్చులకే పరిమితం కావడం లేదు. ఆదాయం సరిపోకపోతే పప్పులు, పాలు, పండ్లు, నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, గిరిజన గ్రామీణ కుటుంబాలపై ఈ భారం అధికంగా పడుతోంది. పౌష్టికాహారానికి అవసరమైన వస్తువులనే కొనలేని పరిస్థితి ఏర్పడితే కుటుంబాల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధరల నియంత్రణ అనేది కేవలం మార్కెట్‌ వ్యవహారం కాదు.. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడిన అంశం. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించడం, సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవడం, అవసరమైన వస్తువులను సరసమైన ధరలకు అందించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు.. వంటింటి ఖర్చును తగ్గించే ఆచరణాత్మక చర్యలు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఉపశమనం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చేతిలో డబ్బులు లేక.. మరోవైపు నిత్యవసరాల ధరల మోతతో చిరు బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement