పార్వతీపురం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, పీవో(ప్రిసైడింగ్ ఆఫీసర్), ఏపీవో(అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్)లకు ఈ నెల 31వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. శిక్షణలో భాగంగా ఎన్నికల విధులు, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల సామగ్రి వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక కారణాలతో ఇప్పటికే ఆర్డర్లు జారీచేసి ఉంటే, వాటి స్థానంలో తాజాగా జారీచేసే ఆర్డర్లే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి
జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులు, కల్వర్టులు, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరికలు జారీచేయాలని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను త్వరగా పునరుద్ధరించాలని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం, సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దష్టి సారించాలని, వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


