సరిహద్దులో సైలెంట్‌గా..! | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో సైలెంట్‌గా..!

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

వంగర మండలంలో పందాలు జరగలేదు..

వంగర మండలంలో ఎక్కడా పొట్టేలు, కోడిపందాలు, పేకా ట శిబిరాలు జరగలేదు. జూ దంపై ఇప్పటికీ గట్టి నిఘా పెట్టాం. ఎక్కడైనా అలా జరిగితే దాడులు చేసి కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తాం. – షేక్‌ శంకర్‌, ఎస్సై, వంగర

వంగర: ఓ వైపు వంగర మండలం..మరో వైపు బలిజిపేట, గరుగుబిల్లి మండలాలకు చెందిన సరిహద్దు ప్రాంతం అది. విస్తారంగా సాగుచేస్తున్న జీడి, మామిడి, నీలగిరి, టేకు, పామాయిల్‌ తోటలు. జనసంచారం అస్సలు ఉండదు. ఇటువైపు ప్రయాణికులు, ప్రజలు, బాటసారులు, వాహనదారుల తాకిడి ఉండదు. అటవీ ప్రాంతాన్ని తలపించే ప్రదేశం ఇది. ఇదే అదునుగా పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సరిహద్దు ప్రాంతాన్ని జూదగాళ్లు అడ్డాగా ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో పొట్టేలు పందాలు జోరుగా సాగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులు టీమ్‌గా ఏర్పడి పందెం సమాచారం, సమయం, ప్రదేశం అందిస్తున్నారు. ఆ సమయానికి ఒక గంట ముందు అక్కడికి చేరుకుని పొట్టేలు పందాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పొట్టేలు పందెం సమయంలో ఈ ప్రదేశం ఒక్కోసారి సంక్రాంతి బరులను తలపిస్తోంది.

పందాలు ఇలా..

వంగర మండలం పెద రాజులగుమ్మడ, చినరాజులగుమ్మడ, బలిజిపేట మండలం పెద్దింపేట, పోలినాయుడువలస గ్రామాల సమీపం (ఇరు మండలాల సరాసరి సరిహద్దు ప్రాంతం)లో పొట్టేలు పందాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పందాల రాయుళ్లు టూవీలర్లు, కార్లు, ఆటోల్లో ఇక్కడికి చేరుకుని పందాల్లో పాల్గొంటున్నారు.

పొట్టేలు రంగు ఆధారంగా బెట్టింగులు..

పొట్టేలు రంగును ఆధారంగా బెట్టింగులు జరుగుతున్నాయి. తెలుపు, నలుగు, ఎరుపు రంగుల పొట్టేళ్లు అధికంగా బరిలో ఉంటున్నాయి. వాటి బరువు, ఎత్తు ఆధారంగా బెట్టింగులు హెచ్చు..డిచ్చులతో సాగుతున్నాయి. పొట్టేళ్లు ఢీకొట్టుకుంటున్న సమయంలో కొంత మంది వ్యక్తులు లక్షకు పైగా బెట్టింగులు కాస్తుండడం విశేషం. వందల సంఖ్యలో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ పందాలను వీక్షిస్తుంటారు.

సరిహద్దు అసలు సమస్య..

ఈ ప్రాంతంలో జరిగే పొట్టేలు పందాలపై పోలీసులు నిఘా ఉంది. పోలీసులకు సరిహద్దు సమస్యగా మారుతోంది. రెండేళ్ల క్రితం వంగర పోలీసులు దాడులు చేసి పందాల రాయుళ్లను, పొట్టేళ్లను అదుపులోకి తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఈ ప్రాంతంలోని నాలుగైదు ప్రదేశాల్లో పందాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వంగర మండలం వైపు, మరికొన్ని సందర్భాల్లో బలిజిపేట మండలం వైపు పందెం నిర్వహిస్తున్నారు. అందువలన పందెం రాయుళ్ల స్కెచ్‌ ఎవరికీ అర్ధం కావడం లేదు. విషయం తెలిసేసరికి అంతా ముగిసిపోతోంది.

కోడి పందాలు..పేకాట కూడా..?

వంగర మండలం వీవీఆర్‌పేట, గరుగుబిల్లి మండలం కొత్తూరు, కొత్తపల్లి సమీపంలోని సరిహద్దుల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే వంగర మండలం–బలిజిపేట మండలం సరిహద్దులో పేకాట శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారంటూ ఈ ప్రాంతంలో ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రైవేట్‌ ఏజెంట్‌ వ్యవస్థ..

వంగర మండలంలోని పలు గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు, పార్వతీపురం పట్టణానికి చెందిన కొంత మంది, బలిజిపేట, గరుగుబిల్లి మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులు టీమ్‌గా ఏర్పడ్డారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓ ప్రైవేట్‌ ఏజెన్సీగా ఏర్పడి పందాలు నిర్వహిస్తున్నారు. వారంతా ఒక తాటిమీద పనిచేస్తుంటారు. పందెం జరిగే సమాచారం సెల్‌ఫోన్ల ద్వారా చేరవేస్తున్నారు. ఆ సమయానికి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నుంచి వస్తున్న కొంత మంది దీనిని వ్యాపారంగా మలుచుకుని కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా

సాగుతున్న పొట్టేలు పందాలు

చేతులు మారుతున్న కోట్ల

రూపాయలు

అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న స్థలంలో బెట్టింగుల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement