గుమ్మలక్ష్మీపురం: స్థానిక హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానం వేదికగా సోమవారం నిజ్జం(ఎన్‌ఐడీజేఏఎం) జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎంఈఓలు ఎల్.శ్రీనివాసరావు, బి.భీముడు ప్రారంభించారు. మన్యం జిల్లా నుంచి అండర్–14, అండర్–16 విభాగాలకు చెందిన 80 మంది బాలబాలికలు క్రీడాకారులు పాల్గొనగా..అథ్లెటిక్స్ క్రీడలైన 60 మీటర్లు, 600 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌ఫుట్, జావెలిన్‌త్రో క్రీడలను ఆడించి జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయికి 11 మంది బాల బాలికలు ఎంపికయ్యారని, ఏడాదికి ఒకసారి నిర్వహించే నిజ్జం క్రీడా పోటీలు జాతీయ స్థాయిలో నవంబర్ 14 నుంచి హైదరాబాద్‌లో జరుగుతాయని క్రీడా పోటీల అసోసియేషన్ సెక్రటరీ పి.చంద్రమోహన్ తెలిపారు. కార్యక్రమంలో పీడీలు సురేష్, రాము, చిన్నారావు, కొండలరావు, జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


