వంటింట్లో మంటలు..! | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో మంటలు..!

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

● ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు

● హడలెత్తిపోతున్న సామాన్యులు

● నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం

వీరఘట్టం:

ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. వెల్లుల్లి ధరలు వెక్కిరిస్తున్నాయి. అల్లం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పచ్చిమిర్చి ధరలు ఘాటెక్కాయి. బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇలా ఒకటేమిటి వంటింటిలో వాడే ప్రతి కాయగూరల ధరతో పాటు పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు గత రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఆమాంతంగా పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం వస్తే సూపర్‌ సిక్స్‌ హామీలతో ప్రశాంతంగా జీవించవచ్చునని ఆశించిన సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు ౖపైపెకి దూసుకుపోతుండడంతో సర్వత్రా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుడు బ్యాగ్‌ పట్టుకుని మార్కెట్‌కు వెళ్లి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో సతమతమవుతున్నాడు. గడిచిన రెండేళ్లలో అమాంతం పెరిగిన నిత్యావసరాలు ధరలను ఏమీ కొనలేం..ఏమీ తినలేం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన నిత్యావసరాల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.

మండుతున్న వంట నూనెలు..

కూరగాయలు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీనికి తోడు వంటనూనెల ధరలు కూడా మండిపోతున్నాయి.రిఫైండ్‌ ఆయిల్‌ ధర రూ.115 నుంచి రూ.175 కి పెరిగింది. పామాయిల్‌ ధర కూడా కొండెక్కి కూర్చుంది. పామాయిల్‌ రూ.90 నుంచి ఇప్పుడు రూ.150కి పెరిగింది. ఇలా అన్ని రకాల నూనెల ధరలు రెండేళ్ల వ్యవధిలో పెరగడంపై సామాన్య, మధ్య తరగతి వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌ డిపోల్లో అరకొరగా సరుకుల పంపిణీ..

నిత్యావవసర సరుకుల ధరలు పెరుగుతుంటే రేషన్‌ డిపోల్లో మాత్రం మొన్నటి వరకు బియ్యం మాత్రమే ఇచ్చారు. ఈ నెల నుంచి బియ్యంతో పాటు అరకిలో పంచదార, కిలో గోధుమపిండి అరకొరగా పంపిణీ చేస్తున్నారు. గతంలో రేషన్‌ డిపోల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను పంపిణీ చేసేవారు. గత ఏడాది జనవరి నుంచి రేషన్‌ డిపోల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు పంపిణీ చేయకపోవడంతో పేదలు పప్పులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు.

పనుల్లేక పస్తులు..

ఒక పక్క పనుల్లేకపోవడం మరో పక్క ధరలు పెరగడంతో పస్తులుండే పరిస్థితి నెలకొంది. పనులు లేకపోవడంతో అప్పులు కూడా పుట్టడం లేదని, ఈ పరిస్థితుల్లో పెరిగిన ధరలు గోరుచుట్టుపై రోకటి పోటులా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ దానిని బోర్డులకే పరిమితం చేస్తున్నారు. ఎవరైనా జీఎస్టీ తగ్గిందని ప్రశ్నిస్తే ఇంకా తమకు ఆదేశాలు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు.

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

సామాన్యులకు నిత్యావసర సరుకుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి.ఓ పక్క పనులు లేక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో బియ్యం, పప్పులు, నూనెల ధరలు పెంచేశారు. గత రెండేళ్లలో ఇంతగా ధరలు పెరిగాయి, ఇంకా భవిష్యత్‌లో ఇంకెంత ఎత్తున ధరలు పెరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది.

– పిన్నింటి దుర్గారావు, వీరఘట్టం

గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి

గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పప్పులు, నూనెలు, బియ్యం ధరలు గత రెండేళ్లతో పోలిస్తే సరాసరిన 50 శాతం వరకు పెరిగాయి. ఇలా నిత్యావసరాల ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యులు బతికేదెలా?

– కర్రి.సింహాచలం, రైతు, వీరఘట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement