పార్వతీపురం రూరల్: యాభై వసంతాలుగా నిరాదరణకు గురవుతున్న జంఝావతి ప్రాజెక్టుకు తక్షణమే జలమోక్షం కల్పించాలని ప్రాజెక్టు సాధన సమితి డిమాండ్ చేసింది. మన్యం జిల్లా ప్రజల సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చే ఈ ప్రాజెక్టు పూర్తికోసం పార్వతీపురంలో చేపట్టిన సాధన దీక్షలు ఆదివారానికి ఆరోరోజుకు చేరుకుని విజయవంతంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, పొరుగున ఉన్న ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన ప్రస్తుత తరుణంలో..దశాబ్దాల అంతర్రాష్ట్ర వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇదే అనువైన సమయమని నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పిస్తే జంఝావతి ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం తథ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరో రోజు దీక్షలో వెంకంపేట గ్రామ రైతులు జాగాన రవిశంకర్, తీళ్ల మాధవనాయుడు, పేరాపాత్రుని భాస్కర్ రావు, బొంత వెంకటేశ్వరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాధన సమితి నేతలు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు, పల్లి రాజగోపాల్ నాయుడు, పాలక రంజిత్ కుమార్, తీళ్ళ గౌరీశంకర్ రావు, ప్రజా నాట్యమండలి కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నేత రామారావు, సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, పాపినాయుడు, మంత్రపూడి వెంకటరమణ తదితరులు హాజరై తమ పూర్తి మద్దతు ప్రకటించారు.


