● బరి తెగించిన పచ్చ సైన్యం ● ఆర్‌వోకు సైతం బెదిరింపులు ● కౌంటింగు సమయంలో అధికార పార్టీకి సంపూర్ణ సహకారం అందించిన అధికార యంత్రాంగం
సాక్షి, పార్వతీపురం మన్యం : అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ప్రాదేశిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. పోలింగు రోజు యథేచ్ఛగా రిగ్గింగుకు పాల్పడుతూ దౌర్జన్యానికి తెర తీసిన కూటమి నాయకులు, కార్యకర్తలు.. ఓట్ల లెక్కింపు రోజునా(శనివారం) అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక కుతంత్రాలకు తెర తీశారు. అధికారులు అందుకు సంపూర్ణ సహకారం అందించారు. వారు చెప్పినట్లుగా తలాడించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నిర్ణ యాన్ని ఖూనీ చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించిన అధికారులు.. వైఎస్సార్‌సీపీ కోరిన చోట తిరస్కరించారు. ఈ క్రమంలో పలుచోట్ల వివాదాలు చోటుచేసుకున్నాయి. బలిజిపేట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి మొదటి రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీకి వెయ్యికిపైగా మెజారిటీ వచ్చింది. మూడో రౌండ్ నుంచి తేడా వచ్చింది. చివరికి వచ్చేసరికి 400 మెజారిటీతో జనసేన గెలిచినట్లు ప్రకటించారు. రీకౌటింగ్ చేయాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టినా ఆర్‌వో పట్టించుకోలేదు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్దే వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు, అభ్యర్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక్కడ లెక్కింపు సమయంలో కట్టలతో ఒక ‘ట్రే’నే సైడ్ చేసేసినట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. పార్వతీపురం మండలం చినబొండపల్లి ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. టీడీపీ వారు రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. అధికారులు రీకౌం
టింగ్‌కు అంగీకరించి, మరలా రెండు ఓట్లు వైఎస్సార్‌సీపీకి తక్కువగా చూపించి విజేతను ప్రకటించారు. సీతానగరం మండలం బూర్జకు వచ్చేసరికి ఆరు ఓట్లతో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ఓటమి ఒప్పుకోక రీకౌంటింగ్‌కు టీడీపీ వారు డిమాండ్ చేశారు. మరలా ఆరు ఓట్ల తేడానే వచ్చింది. ఇది జీర్ణించుకోలేని పచ్చసైన్యం విజేతను ప్రకటించవద్దని పట్టుబట్టింది. ఆర్‌వోపై ఒత్తడి తెచ్చింది. అక్కడ నుంచే మండల నాయకులు తమ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. ఆయన సైతం వచ్చి హడావిడి చేశారు. ఎలా ఉద్యోగం ఇక్కడ చేస్తావో చూస్తామంటూ ఆర్‌వోను బెదిరించారు. సాలూరులో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. మొదటంతా వైఎస్సార్‌సీపీ మెజారిటీతోనే నడచింది. చివరికి వచ్చేసరికి 65 ఓట్ల మెజారిటీ అంటూ ప్రకటించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ ఎక్కువస్తుందని.. ఏదో తేడా జరిగిందని తెలిపారు. దీనిపైనా టీడీపీ వారు పెద్ద రాద్ధాంతమే చేశారు.


