గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీగా గౌరీశంకరరావు
సాలూరు: సాలూరు జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దండి అనంతకుమారి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిని రమాదేవిపై అనంతకుమారి 65 ఓట్లు మెజార్టీతో గెలిచారు. ప్రతి రౌండ్‌లో అనంతకుమారి మెజార్టీ సాధించి చివరకు 65 ఓట్లతో గెలిచినట్టు ఆర్‌ఓ రమణమూర్తి ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్లో ఇరు పార్టీలకు చెరో 77 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా అనంతకుమారి భర్త దండి శ్రీనివాసరావు మరిపల్లి ఎంపీటీసీగా గెలిచారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించినట్టయింది.
మక్కువ: మక్కువ జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మర్రి పారమ్మ విజయకేతనం ఎగురవేశారు. ఈమె తన సమీప ప్రత్యర్థిపై 701 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈమెను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభినందించాయి. వైఎస్సార్‌సీపీ విజయంపై పార్టీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మడక నవ్యశ్రీ గెలుపొందింది. సమీప ప్రత్యర్థి బీజేపీపై 301 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫలితం చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే దక్కింది. దీంతో పార్టీ శ్రేణులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. నవ్యశ్రీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు.
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్తడ గౌరీశంకరరావు గెలుపొందారు. కుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయనకు మొత్తం 11,835 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి పాడి సుదర్శనరావుకు 3,953 ఓట్లు వచ్చాయి. దీంతో 7,882 ఓట్లు మెజార్టీతో శంకరరావు గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.


