● తొలి విడతలో పాలకొండ డివిజన్, మలి విడతలో పార్వతీపురం ● పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
సాక్షి, పార్వతీపురం మన్యం: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ప్రాదేశిక సమరమూ పూర్తయ్యింది. ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఇక మిగిలింది ‘పంచాయతీ’ పోరే.. రెండు దశల్లో జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో 451 పంచాయతీలు ఉన్నాయి.
●మొదటి దశలో పాలకొండ డివిజన్‌లోని ఏడు మండలాలు.. 257 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. 17వ తేదీలోగా నామినేషన్లు స్వీకరిస్తారు పరిశీలన, అప్పీల్లు, ఉపసంహరణ అనంతరం ఈ నెల 21వ తేదీన బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. 26వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.
●రెండో దశలో పార్వతీపురం డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది మండలాలు, 224 పంచాయతీల ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పరిశీలన, అప్పీలు, ఉపసంహరణ అనంతరం తుది పోటీ అభ్యర్థుల జాబితాను ఈ నెల 24వ తేదీన ఖరారు చేస్తారు. ఈ నెల 29వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను పంచాయతీ అధికారులు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సాధారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి సుమారు 650 మంది ఓటర్లను కేటాయించేలా కసరత్తు చేశారు.
పంచాయతీల్లో సామాజిక వర్గాల వారీ ఓటర్లు
ఎస్టీ : 1,98,443 ఎస్సీ : 77,412
బీసీ : 3,48,928 ఇతరులు : 19,091


