సమస్యల నివేదన | - | Sakshi
Sakshi News home page

సమస్యల నివేదన

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

● కంచె వేసి.. కడుపు కొట్టి.. ● ఊరు ఒకచోట.. భవనం మరోచోట.. ● చనిపోయినా కష్టాలే.. ● అవినీతిపై చర్యలేవీ?

అర్పిత్‌ మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్‌

కనీస వసతులు కల్పించండి

పార్వతీపురం రూరల్‌:

పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. భూకబ్జాలు, మౌలిక వసతుల లేమి, అధికారుల అలసత్వం, అనుమానాస్పద మృతులపై బాధితులు తమ ఆవేదనను విన్నపాల రూపంలో అధికారులకు అందజేశారు. పరిష్కరించాలంటూ వేడుకున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో పేర్లున్నాయి.. చేతిలో వన్‌ బీ, పాస్‌ పుస్తకాలున్నాయి.. కానీ, భూమిలోకి అడుగుపెట్టే హక్కు మాత్రం లేదు. ఇది కెమిశీల రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల దీనావస్థ. సర్వే నంబర్‌ 11/3లో తమకున్న 2.33 ఎకరాల డీ–పట్టా, జిరాయితీ భూములను గన్నమని ఆగ్రో ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పద్మశ్రీ కబ్జా చేశారని రైతు నగిరి రాజేష్‌తో పాటు పలువురు రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సదరు సంస్థ సుమారు 150 ఎకరాలకు కంచె వేయడంతో, ఆ మధ్యలో ఉన్న తమ భూముల్లోకి వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

మంజూరైన పంచాయతీ భవనాన్ని ప్రధాన కేంద్రంలో కాకుండా మరో గ్రామంలో నిర్మిస్తుండడంపై పాచిపెంట మండలం మోదుగ గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. గ్రామంలో స్థలం కేటాయించినా ఆడారిపాడులో భవనం నిర్మించడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిరా్యాదుచేశారు.

మనిషి చనిపోయినా మృతదేహాలను ఖననం చేసేందుకు జాగా కరువైందంటూ పాచిపెంట మండల కేంద్రంలోని రెల్లివీధి వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. శ్మశానవాటిక ఆక్రమణలకు గురికావడంతో వేగావతి నదీ తీరంలోని ఇసుకమేటలపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని వాపోయారు. నదికి వరద వచ్చిన ప్రతిసారీ పూడ్చిన మృతదేహాలు బయటపడుతున్నాయన్నారు. శ్మశానవాటిక ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.

సామాజిక పింఛన్ల పంపిణీకి రాజకీయ రంగు పులమడంపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం అధికారులు (పీడీవోలు) మాత్రమే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేసేలా చూడాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, తదితరులు డీఆర్‌డీఏ పీడీ ప్రభావతిని కోరారు. మరోవైపు, ఐటీడీఏలో వెలుగు ఏపీడీగా పనిచేసిన సత్యంనాయుడు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదిక ఏమైందని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డిని నిలదీశారు. వనధన్‌ కేంద్రాల నిధులు, ధాన్యం, పసుపు కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, విచారణ వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య (ఈఎంఆర్‌ఎస్‌ ) పాఠశాలలో ఏడో తరగతి చదువుతూ ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సీతంపేట మండలం ఎర్నన్నగూడకు చెందిన విద్యార్థి సవర అర్పిత్‌ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదివాసీ జేఏసీ, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. సీనియర్ల దాడి, ఇంగ్లిష్‌ మీడియం నెపంతో ఉపాధ్యాయుల దండన, మెస్‌లో అరకొర భోజనం వంటి కారణాలే విద్యార్థి ఉసురు తీశాయని ఆరోపించారు. నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎకరం భూమిని 15 రోజుల్లోగా మంజూరు చేయాలని, లేదంటే శాంతియుత ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

పట్టణంలోని కొత్తవలస–పాలకొండ రోడ్డులోని పాపురెడ్డి కాలనీలో పక్కా రోడ్డు, మురుగు కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరారు. 26 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆస్తి, నీటి పన్నులు చెల్లిస్తున్నా మౌలిక వసతులు కల్పించలేదని వాపోయారు. కాలనీ సమస్యలను కలెక్టర్‌ డా.ఎన్‌ ప్రభాకర రెడ్డికి విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement