● జేసీ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 23 లోగా పరిశీలన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలన్నారు. అలాగే, ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలందరితో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. అక్టోబర్ 5న మాపప్ కార్యక్రమం కింద మిగిలిపోయిన వారందరితో మాత్రలు మింగించాలన్నారు. ఈనెల 24 వరకు కుష్ఠువ్యాధిగ్రస్తులను గుర్తించే ఇంటింటి సర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో పీహెచ్.సత్తిబాబు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మజ, డీఎల్‌ఓ కె.రాణి, తదితరులు పాల్గొన్నారు.


