25 నుంచి మన్యం జెడ్పీ! | - | Sakshi
Sakshi News home page

25 నుంచి మన్యం జెడ్పీ!

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

24న పెదపెంకికి పవన్‌కల్యాణ్‌?

తాత్కాలిక భవనంలో ప్రారంభం కానున్న కార్యకలాపాలు

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలు విభజిస్తూ, ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పార్వతీపురం మండలం నర్సిపురంలోని పంచాయతీ వనరుల కేంద్రం భవనంలో తాత్కాలికంగా జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్తగా సీఈవో, జెడ్పీ సీఈవో పోస్టులతోపాటు, మరో 25 మంది సిబ్బందిని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సర్దుబాటు చేయనున్నారు. మన్యం జెడ్పీ పరిధిలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లోని 15 మండలాల ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు జరిగి, కొత్తగా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకూ జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ వ్యవహరించే అవకాశాలున్నాయి.

ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 24వ తేదీన జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సమాచారం రావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో సీసీ రహదారులు, మ్యాజిక్‌ డ్రైన్ల ప్రారంభోత్సవానికి ఆయన రానున్నారు. పెదపెంకిలో బోద వ్యాధి నివారణలో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకున్న ఉప ముఖ్యమంత్రి.. అక్కడ సీసీ రహదారులు, మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణం కోసం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం విదితమే. గత మార్చిలో పనులు ప్రారంభం కాగా.. నేటికీ అవి ఒక రూపునకు రాలేదు. గతంలో రెండుసార్లు ఇక్కడికి పవన్‌ కల్యాణ్‌ వస్తారని భావించినా, పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ అక్కడి పనులు అరకొరగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 24వ తేదీన అయినా ఆయన పర్యటన ఉంటుందా, లేదా? అన్నది సందిగ్ధమే. అధికార వర్గాలు మాత్రం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పార్వతీపురం: పెండింగ్‌ సమస్యలను వేగంగా పరిష్కరించి, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదవ విడత రీ–సర్వే, పీపుల్స్‌ ప్రాపర్టీబుక్‌ (పీపీబీ), రెవెన్యూ వన్‌బీ, భూ సేకరణ, 4జీ టవర్లు, పింఛన్ల పంపిణీ, ఈ–క్రాప్‌ బుకింగ్‌, తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.

32 మంది ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలు

సీతంపేట: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు సోమవారం బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 32 మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులను శ్రీకాకుళం జిల్లాకు, శ్రీకాకుళం నుంచి 32 మంది ఉపాధ్యాయులను పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీచేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఉపాధ్యాయుల కేడర్‌ సర్దుబాటు, కేటాయింపుల్లో భాగంగా పరస్పర బదిలీల ప్రక్రియ చేపట్టినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ అప్పారావు, డిప్యూటీ ఈఓ నారాయుడు, జీసీడీఓ రాములమ్మ, సీఎంబీ చిరంజీవులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement