ఘనంగా గురజాడ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గురజాడ జయంతి

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

విజయనగరం క్రైమ్‌: నవయుగ వైతాళికుడు, మహా కవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు విజయనగరం పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గురజాడ స్వగృహం, గురజాడ కాంస్య విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గురజాడ స్వగృహానికి చేరుకుని, గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వగృహంలోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత గురజాడ స్వగృహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు నిర్వహించిన గురజాడ గీతాలాపన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. గురజాడ సాహిత్య, సామాజిక సంస్కరణల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. అనంతరం గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురజాడ రచనలు సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అంటూ గురజాడ అందించిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు గురజాడ చేసిన కృషి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. గురజాడ ఆశయాలను భావితరాలకు అందించేందుకు, ఆయన సాహిత్యాన్ని, సామాజిక సందేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. విజయనగరంఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. గురజాడ రచనలు సమాజంలో చైతన్యాన్ని నింపి, ప్రజల్లో సామాజిక మార్పుకు బాటలు వేశాయని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన వంటి అంశాలపై గురజాడ అందించిన సందేశాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్బంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌, గురజాడ అప్పారావు మునిమనుమడు ప్రసాద్‌ రావు, ముని మనుమరాలు ఇందిర, లోక్‌ సత్తా ప్రతినిధి భీశెట్టి బాబ్జీ, గురజాడ సమాఖ్య ప్రతినిధులు డా.గోపాలరావు, డా.వెంకటేశ్వర రావు, కాపుగంటి ప్రకాశ్‌, వివిధ సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

గురజాడ గొప్ప దార్శనికుడు

ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు

విజయనగరం: దేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దేశాభివృద్ధిలో తమ వంతుపాత్ర పోషించాలన్న మహాకవి గురజాడ గొప్ప దార్శనికుడని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలో 42వ డివిజన్‌, అయ్యన్నపేట, కామాక్షి నగర్‌ మున్సిపల్‌ నడక మైదానంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ మహాకవి గురజాడ 164వ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఆయన సాహిత్య ప్రభావం శతాబ్దకాలానికి పైగా నిత్యనూతనంగా, ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగిస్తూ మార్గనిర్దేశం చేస్తోందన్నారు. గురజాడ సాహిత్యం భావి తరాలకు అందాలన్నారు. తెలుగు భాషా సాహిత్యంలో గురజాడ సాహిత్యం విశిష్టమైనదన్నారు. ప్రతి ఒక్కరూ మాటల కంటే చేతల ద్వారా సమాజానికి తోడ్పడాలన్న గురజాడ మాట ఆచరణీయమని డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. కార్యక్రమంలో అంజనీపుత్ర వాకర్స్‌ గౌరవాధ్యక్షుడు త్యాడ రామకృష్ణ , క్లబ్‌ సభ్యులు, వాకర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

గురజాడ స్వగృహంలో 164వ జయంతి వేడుకలకు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం

కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement