గుమ్మలక్ష్మీపురం: డోలీ మోతల యాతన తమకు తప్పేదెన్నడని గుమ్మలక్ష్మీపురం మండలం వాడబాయి గిరిశిఖర గ్రామానికి చెందిన గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈకేవైసీ కాకపోవడంతో వాడబాయి గ్రామానికి చెందిన తోయక తులసమ్మ అనే వృద్ధురాలి బ్యాంకు ఖాతా నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించేందుకు వృద్ధురాలిని బ్యాంకుకు తీసుకురావాల్సిందేనంటూ బ్యాంకు సిబ్బంది తేల్చిచెప్పడంతో తప్పని పరిస్థితుల్లో సోమవారం ఆ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఇలా మోసుకుంటూ కిలోమీటరు దూరంలో ఉన్న దేరుగండకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో ఎగువ తాడికొండ మీదుగా గుమ్మలక్ష్మీపురంలోని బ్యాంకుకు తీసుకొచ్చారు. బ్యాంకు పని ముగించుకొని మరలా అదే క్రమంలో ఇంటికి తీసుకెళ్లారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని, ప్రభుత్వం ఇప్పటికై నా తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని వాడబాయి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


