పింఛన్‌! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌!

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

పింఛన్‌! పచ్చ గుర్తు ఉంటేనే

దరఖాస్తు తిరస్కరించారు

పచ్చ గుర్తు ఉంటేనే

సాక్షి, పార్వతీపురం మన్యం: కొత్త పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ పట్టుమని పది రోజులు కూడా సాగలేదు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులకు కొత్త పింఛన్లకు అర్హత ఉన్నా.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకునేలోపే దరఖాస్తు ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల నమోదు ప్రక్రియ కేవలం 9 పనిదినాల్లో శుక్రవారం (18వ తేదీ)తో ముగిసింది. గడచిన రెండేళ్ల రెండు నెలల కాలంలో అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఒకరోజు ముందు ప్రకటించి.. హడావిడిగా ఆన్‌లైన్లో దరఖాస్తుల నమోదును చేపట్టారు. రెండేళ్లపాటు పింఛన్‌ కోసం ఎదురు చూసిన వేలాది మంది ఒకేసారి దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయాలకు క్యూ కట్టారు. ప్రతిరోజూ దరఖాస్తుల నమోదు పోర్టల్‌ మొరాయించింది. అష్టకష్టాలు పడి ధ్రువ పత్రాలు తెచ్చుకున్న వారు కొందరైతే.. అవి సమకూర్చుకునేలోపే గడువు ముగిసిపోయి మిగిలిపోయిన వారు చాలామంది ఉన్నారు. వీరంతా సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వరుస కట్టారు. దరఖాస్తులు తీసుకోవాలని ప్రాథేయపడ్డారు.

ఎమ్మెల్యే చెబితేనే దరఖాస్తులకు మోక్షం..

జిల్లాలో కొత్త పింఛన్‌ కోసం 27,945 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకూ వెరిఫికేషన్‌ చేస్తారు. సోమవారం ఉదయం నాటికి 2,425 దరఖాస్తులు అర్హత సాధించాయి. 240 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురి కాగా.. 25,280 పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయాల నుంచి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక ఎంపీడీవో లాగిన్‌ ద్వారా అప్రూవల్‌కు వెళ్లాలి. నియోజక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఆ జాబితా చూసి, ‘ఓకే’ చేసిన తర్వాతే.. లాగిన్‌ నుంచి వెళ్తోంది. జిల్లాలో ఓ నేత రెండు మండలాలకు సంబంధించి ‘అప్రూవల్‌’ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అన్ని చోట్లా.. ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పచ్చ బిళ్లలు ఉన్నవారికే పింఛన్లు అందిస్తారని అధికార పార్టీకి చెందిన వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే కనీసం అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పాలకొండ నియోజకవర్గం వండువ గ్రామానికి చెందిన రేజేటి సంజీవు పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. సదరం కోసం గతంలో పాలకొండ ఆస్పత్రికి దరఖాస్తు చేసుకుంటే తాత్కాలిక సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే.. సచివాలయంలో తిరస్కరించారు. తనకు శాశ్వత సదరం ఇప్పించి, పింఛను మంజూరు చేయించాలని వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement