మన్నించయ్యా బొజ్జ గణపయ్యా..! | - | Sakshi
Sakshi News home page

మన్నించయ్యా బొజ్జ గణపయ్యా..!

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

వెక్కిరిస్తున్న వర్షాభావం

అడుగంటిన చెరువులు

నీళ్లు లేక తేలియాడుతున్న విగ్రహాలు

పార్వతీపురం రూరల్‌: వినాయక చవితి ఉత్సవాల అనంతరం భక్తిశ్రద్ధలతో సాగుతున్న నిమజ్జన ఘట్టాలకు వర్షాభావం అడ్డంకిగా మారింది. మంటపాల నుంచి డప్పు చప్పుళ్లు, కోలాహలం నడుమ శోభాయమానంగా సాగిన విగ్రహాల ఊరేగింపులు స్థానిక చెరువుల వద్దకు చేరుకోగానే భక్తులకు నిరాశే మిగులుతోంది. ఆశించిన వానలు కురవక, స్థానిక జలాశయాలు అడుగంటడంతో చెరువుల్లో చుక్కనీరు కరువైంది. దీంతో ఘనంగా తరలివచ్చిన బొజ్జ గణపయ్యలకు గంగమ్మ ఒడిలో పూర్తిగా మునిగే భాగ్యం లేకపోయింది. లోతైన జలాలు లేకపోవడంతో, కేవలం అడుగు లోతు నీటిలోనే విగ్రహాలను వదిలిపెడుతున్నారు.ఫలితంగా జలగర్భంలోకి చేరాల్సిన విఘ్నేశ్వరుడు..నీటిలో మునగకుండా అలా సగంలోనే కూర్చున్నట్లు దర్శనమిస్తూ భక్తులను కలవరపెడుతున్నాడు. నిండు కుండల్లా తొణకాల్సిన జలాశయాలు వెక్కిరిస్తుండడం, కొద్దిపాటి నీటిలోనే కొలువుదీరిన విగ్రహాలను చూస్తుంటే ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ తీవ్రత కళ్లకు కట్టినట్లు స్పష్టమవుతోంది. నిండిన చెరువులను చూడాల్సిన కళ్లకు, బీటలు వారిన నేలలు దర్శనమిస్తుండడం చూపరులను బాధిస్తోంది. ‘సరైన జల వనరులు లేక నీటిలో పూర్తిగా నిమజ్జనం చేయలేకపోయాం, మన్నించయ్యా విఘ్నేశ్వరా‘ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement