● రూమ్‌లోకి తీసుకెళ్లి ఎస్సై చావగొట్టారు
● మీడియా ముందు వాపోయిన బాధితుడు
కొమరాడ/కురుపాం: ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదు..ఏమి తప్పుచేశానో చెప్పలేదు..నన్ను కురుపాం ఎస్సై పి.నారాయణ రావు శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్‌కు తీసుకెళ్లారు.. రూమ్‌లోకి తీసుకెళ్లి చావగొట్టారు.. దండం..దండం అంటున్నా విడిచిపెట్టలేదు.. ఏం చేశాను సార్ అని ప్రశ్నించినా వినిపించుకోకుండా లాఠీతో తట్టులు తేరేలా కొట్టారంటూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మాదలింగి గ్రామానికి చెందిన బర్ల ఆదినారాయణ శనివారం మీడియా ముందు వాపోయాడు. తనను కొడుతుండగా విడిచిపెట్టాలంటూ తమవారు ప్రాధేయ పడితే మెడ పట్టుకుని ఎస్సై గెంటేశారంటూ కన్నీరుపెట్టాడు. లాఠీ దెబ్బలను మీడియాకు చూపించాడు. ఫిర్యాదు చేసిన వారు ఎవరో కూడా తమకు తెలియదన్నాడు. అయితే, మేకల పెంపకం అంశంలో తలెత్తిన వివాదంపై గుజ్జివాయికి చెందిన గిరిజన మహిళలు ఆదినారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుచేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా భౌతికంగా దాడిచేయడం సరికాదని పేర్కొంటూ ఎస్సై తీరును తప్పుబట్టాయి.


