చిరిగిన వాటితోనే బడులకు..
బూట్లు ఎక్కడ.. చెప్పులతోనే బడికి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
పేద విద్యార్థులకు చేయూత నిచ్చి... సర్కారు పాఠశాలలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగులు, బూట్లు అందిస్తుంటాయి. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను సరఫరా చేస్తోంది. ఇందులో విద్యార్థులకు అవసరమైన బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువు, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు ఉంటాయి. గత జూన్ లో పాఠశాలలు ప్రారంభం కాగా.. రెండు నెలలు తిరగక ముందే కిట్ల నాణ్యత బయట పడిపోయింది. పథకం లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పలువురు విద్యార్థులకు బూట్లు అందకపోవడంతో వారు సాధారణ చెప్పులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు.
నాణ్యతపై పర్యవేక్షణ ఏది?
కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందిస్తున్నప్పుడు వాటి నాణ్యత, పంపిణీపై అధికారులు పటిష్టంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. బ్యాగులు కొద్దిరోజులకే చిరిగిపోతుంటే వాటి తయారీ నాణ్యతను పరిశీలించారా? సరఫరా చేసిన సామగ్రిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో 1,447 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా... సుమారు 98 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడులకు పంపిణీ చేసిన బ్యాగులు నాణ్యతలో తక్కువగా ఉండడంతో కొద్ది రోజులకే కుట్టులు ఊడిపోవడం, జిప్పులు దెబ్బతినడం, అడుగు భాగం చిరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని మోసుకెళ్లాల్సిన బ్యాగులు మధ్యలోనే చిరిగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చిరిగిన భాగాలను తాళ్లతో, దారాలతో కుట్టించుకుని వాటినే ఉపయోగిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు తమ సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
బ్యాగుల సమస్యకు తోడు బూట్ల పంపిణీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులకు బూట్లు అందకపోవడంతో సాధారణ చెప్పులు ధరించి తరగతులకు వస్తున్నారు. ఇటీవల పాల కొండలో ఆగస్టు 15 సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు చెప్పులతోనే కనిపించారు. పార్వతీపురం, బలిజిపేట తదితర మండలాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కొంతమంది పిల్లలకు పూర్తి స్థాయిలో అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చిరిగిన బ్యాగులు.. చెప్పులతోనే బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాల సంచుల నాణ్యతపై ప్రశ్నలు
పలువురు విద్యార్థులకు అందని బూట్లు


