విచారణ ఉత్తుత్తిదేనా! | - | Sakshi
Sakshi News home page

విచారణ ఉత్తుత్తిదేనా!

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

కొత్తవలస:

విశాఖపట్నానికి సరిహద్దుగా ఉన్న కొత్తవలస మండలంలో ప్రభుత్వ భూములకు కాళ్లొచ్చాయి. బడానేతల కబంద హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. చెరువు గర్భాలు జిరాయితీ భూములుగా మారుతున్నాయి. సబ్‌ డివిజన్‌ల పేరుతో ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేసి బడాబాబుల పేరున బదలాయిస్తున్న తీరు పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది. భూముల కబ్జా తీరును ‘భూ మాయ’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించారు. సంబంధిత తహసీల్దార్‌ అప్పలరాజును సస్పెండ్‌చేశారు. విచారణ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, అప్పటి ఇన్‌చార్జి డీఆర్వో మురళీని నియమించారు. ఇది జరిగి 9 నెలలు గడుస్తున్నా ఆ భూములు ఇప్పటికీ అదే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో చూపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచారణ ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌చేసి ప్రభుత్వ భూములను మాయ చేయడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రికార్డులు సరిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

9 నెలలు గడుస్తున్నా అతీగతీలేని వైనం

వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీ భూములుగా దర్శనమిస్తున్న ప్రభుత్వ భూములు

రీ సర్వేలో సర్దుబాటుకు తెరవెనుక

మంతనాలు

రీ సర్వేలో సర్దుబాటుకు ప్రయత్నాలు

ప్రస్తుతం కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో రీ సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేందుకు బడాబాబులు నిత్యం రెవెన్యూ అధికారులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అక్రమంగా సంపాదించిన భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. చెరువు గర్భాలు, ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు జరిగిపోతే ఎవరిది బాధ్యత అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భూ మాయపై విచారణ కొనసాగుతోందని ఇ.మురళి చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement