విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయితడపనిదే ఏ పని జరగదని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. కష్టపడి పనిచేసినా ఎంతో కొంత ముట్టజెబితే తప్ప ప్రతిఫలం అందదని విమర్శిస్తున్నారు. ఉద్యోగోన్నతులు, సరెండర్ లీవులు, రిలీవింగ్ ఆర్డర్స్, మెటర్నిటీ లీవ్‌లు.. ఇలా ప్రతీదానికి మామ్మూళ్లు రూపంలో ఇస్తేగాని పని జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా దంత వైద్యులకు చెల్లించాల్సిన ఫ్యూయల్ చార్జీలకు కూడా కమిషన్ ఇస్తేగాని నిధులు జమ చేయబోమని కండిషన్ పెట్టినట్టు తెలిసింది.
ఇదెక్కడి అన్యాయం...
నేషనల్ ఓరల్ హెల్త్ ప్రొగ్రాం( ఎన్‌ఓహెచ్‌పీ)లో భాగంగా దంత వైద్యులు వారికి కేటాయించిన పీహెచ్‌సీలకు వెళ్లేవారు. వారంలో మూడు రోజులపాటు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించేవారు. పీహెచ్‌సీలకు వచ్చిన రోగుల్లో దంత సంబంధిత సమస్యలు ఉన్న వారిని గుర్తించి అక్కడ చికిత్స అందించిన కల్గిన వాటికి చికిత్స అందించేవారు. లేదంటే సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను రిఫర్ చేసేవారు. నోటికేన్సర్‌కు సైతం స్క్రీనింగ్ చేసేవారు. ఇలా సేవలందించిన వైద్యులకు ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) చార్జీల కింద నెలకు రూ.7 వేలు చెల్లించాలి. జిల్లాలో వైద్యసేవలందించిన 9 మంది దంత వైద్యులకు ఫ్యూయల్ చార్జీల కింద 27 నెలలకు కొద్దిరోజుల కిందట రూ.13 లక్షల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం వీటిని వెంటనే వైద్యుల ఖాతాల్లో జమచేయాలి. అయితే, నిధులు చెల్లించాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన ఓ అధికారి, ఓ ఉద్యోగి 10 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. కమీషన్ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని తెగేసి చెప్పినట్టు తెలిసింది. వ్యయప్రయాసలకోర్చి పీహెచ్‌సీలకు వెళ్లి సేవలందించామని, ఇంధన ఖర్చుల్లో కమీషన్ దందా ఏమిటంటూ పలువురు వైద్యులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు.
తన దృష్టికి రాలేదు
దంతవైద్యులకు చెల్లించాల్సిన ఇంధన నిధుల్లో 10 శాాతం కమీషన్ అడిగిన విషయం తన దృష్టికి రాలేదు. ఎవరైనా కమీషన్ అడిగితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
ఎన్‌ఓహెచ్‌పీలో భాగంగా పీహెచ్‌సీల్లో సేవలందించిన దంత వైద్యులు
27 నెలలకు వారికి ఫ్యూయల్ చార్జీల కింద రూ.13 లక్షలు విడుదల
ఈ నిధులు దంత
వైద్యులకు చెల్లించేందుకు 10 శాతం కమిషన్ డిమాండ్ చేసిన డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఉద్యోగి!
ఆవేదనలో వైద్యులు


