● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి
● ఘనంగా గురు పూజోత్సవం
జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులతో కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. నర్సిపురంలోని ఓ కన్వెన్షన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యాశాఖ సమష్టి కృషి వల్లే పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా నాలుగోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉపాధ్యాయులు బోధనతో పాటు విద్యార్థులలో సృజనాత్మకత, సానుకూల దృక్పథం, శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించాలని సూచించారు. జిల్లాలో బడి మానేసే వారి శాతం ఒకటి కంటే తక్కువగా నమోదైందని తెలిపారు. ‘ముస్తాబు’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, ‘ఇంగ్లిష్ మన్యం’, ‘అబాసీ’ విధానాల ద్వారా భాషా, సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ‘ముస్తాబు’ ఫలితాలు, విద్యార్థుల క్రీడా ప్రగతిని ఆర్‌డీఓ కె.మాధురి ప్రస్తావించగా, ఇంటర్‌లో చేరికలు పెరిగినట్లు ఆర్‌ఐఓ హరగోపాల్ తెలిపారు. అనంతరం ‘కథ చెబుతారా’ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఎంపికై న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆర్‌డీఓ కె.మాధురి, డీఈఓ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. జిల్లాలోని 1,702 ప్రభుత్వ పాఠశాలల్లో 1.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, 10వ తరగతిలో 96 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించామని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇంటర్ విద్యాధికారి డా. వి.హరగోపాల్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


