పోస్టుల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

పోస్టుల్లేవ్‌!

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

సొమ్ములిచ్చేశారు..

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ ప్రకటనలో మొత్తం 258 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మే నెల 21, 22వ తేదీల్లో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. నాలుగు నెలలు గడిచినా నేటికీ నియామకాలు పూర్తి చేయలేదు. మధ్యలో ఓసారి అంగన్‌వాడీ సహాయకుల పోస్టు లను భర్తీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎంపికై న వారికి ఫోన్‌ ద్వారా సమాచారం కూడా అందించారు. మరుసటి రోజు వచ్చి, ప్రజాప్రతినిధుల ద్వారా నియామకాలు అందుకోవాలని తెలిపారు. ఈలోగా తాము సూచించిన కొంతమందికి పోస్టులు రాకపోవడంతో అధికార పార్టీ నాయకులు కొర్రీ పెట్టారు. అంతే... పోస్టుల్లేవ్‌, గీస్టుల్లేవ్‌.. తూచ్‌! అంటూ నియామక పత్రాల జారీ ప్రక్రియను నిలుపుదల చేశారు. అప్పటి నుంచి అసలు పోస్టులు తీస్తారా, తీయరా? అన్న సందేహాలు దరఖాస్తుదారుల్లో రోజురోజుకూ అధికమవుతున్నాయి.

జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు..?

మౌఖిక పరీక్షలు ముగిసినప్పటికీ నియామక జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు. నెలలు గడుస్తున్నాయి. అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తక్షణమే మెరిట్‌ జాబితాను విడుదల చేయాలి. ఈ పోస్టుల నియామకాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. దీనిపై అధికారులే స్పష్టత ఇవ్వాలి.

– కె.సాంబమూర్తి,

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు

ఏం జరుగుతోందో తెలియక..!

అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సయోధ్య కుదరకనే పోస్టుల భర్తీ నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ నోటిఫికేషన్‌ వెలువడింది మొదలు.. పోస్టులను దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు. అడిగినంత మొత్తంలో రూ.లక్షల్లో డబ్బులిచ్చేశారు. ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయి.. పోస్టుల్లో చేరిపోవడమే తరువాయి.. అన్న సంతోషంతో చాలామంది ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యోగుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులిచ్చి, ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో చాలామందికి కనీస పరిజ్ఞానం కూడా లేనట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క పోస్టుకూ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు రావడంతో, అర్హులు నష్టపోవడం ఒకటైతే, తీవ్ర విమర్శలు వస్తాయన్న ఆలోచనతో జిల్లా ఉన్నతాధికారి ఈ జాబితాను పక్కన పెట్టేసినట్లు వినిపిస్తోంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఒక్క కొలిక్కి రాకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు.

డబ్బులిచ్చిన వారి పరిస్థితి ఏమిటి?

ఉన్న ఊరిలో పోస్టులు దక్కుతాయన్న ఆశతో ప్రజాప్రతినిధులకు చాలామంది అభ్యర్థులు రూ.లక్షల్లో ముట్టుజెప్పినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాల్లేవు. డబ్బులూ రావు! నియామక ప్రకటన కోసం ఆశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పోస్టులు రాకపోతే తమ డబ్బులైనా ఇచ్చేయాలని ఛోటా నాయకుల చుట్టూ పలువురు అభ్యర్థులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. లేకుంటే, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకై నా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

అంగన్‌వాడీ పోస్టుల

నియామకాలపై సందేహాలు

ఇప్పటికే ఛోటా నేతలకు

డబ్బులిచ్చేసిన అభ్యర్థుల్లో

ఆందోళన

తమ నగదు వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement