పార్వతీపురం రూరల్: ప్రజల చెంతకే రక్షకభటులు చేరి, వారి కష్టసుఖాలు తెలుసుకునేలా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపట్టిన ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకూ తీసుకెళ్లాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన జూమ్ వేదికగా వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వృత్తిని కేవలం విధి నిర్వహణగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ వాడవాడలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది తమకు కేటాయించిన దత్తత గ్రామాల్లోని ప్రతీ ఇంటినీ సందర్శించి, క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సున్నిత అంశాలపై ముందస్తు సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని స్పష్టం చేశారు. దత్తత గ్రామంలో ‘విలేజ్ పోలీస్’గా చెరగని ముద్ర వేసుకోవాలని, మీ రక్షణ కోసమే మేమన్న భరోసాను కల్పించాలన్నారు.


