ఉన్నవి అవస్థలే! | - | Sakshi
Sakshi News home page

ఉన్నవి అవస్థలే!

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

మ్యాజిక్‌ లేదు.. మంత్రం లేదు...

● ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెంకి నారాయణ. పెదపెంకి గ్రామంలోని ప్రధాన రోడ్డులో నివసిస్తున్నాడు. కాలువల కోసమని వీరి ఇంటి ముందు చాలా రోజుల క్రితమే గొయ్యిలు తవ్వేసి వదిలేశారు. ఇంటికి వెళ్లడానికి మార్గం కూడా లేకుండా చేసేశారు. అక్కడ నీరు నిల్వ ఉండిపోతోంది. ఇసుక, సిమెంట్‌ బస్తాలనే మెట్ల మార్గంగా చేసుకున్నామని.. బాగున్న ఊరిని నాశనం చేసి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

గ్రామమంతా ఇళ్ల ముందు మెట్లు కొట్టేయడంతో ఇటువంటి దృశ్యాలే..

సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని బోధవ్యాధి ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దోమలు, పారిశుధ్య లోపమని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు రూ.6 కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. ఊరంతా సిమెంట్‌ రోడ్లు, మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద గ్రామంలో 66 సీసీ రహదారులు 79 మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. మూడు, నాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో ప్రారంభోత్సవానికి సన్నాహాలు కూడా అధికారులు చేసేశారు. ఇక్కడ పనులపై నివేదిక తెప్పించుకున్న ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే కాదు.. గ్రామస్తులు సైతం పనుల పట్ల కోపోద్రిక్తులవుతున్నారు. అధికారులు ఊరిలో అడుగు పెడితే చాలు.. దుమ్మెత్తి పోస్తున్నారు.

ఆనందం లేదు.. మిగిలిందంతా గొయ్యిలు, రాళ్లే!

గ్రామమంతా సీసీ కాలువలు, మ్యాజిక్‌ డ్రైన్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ప్రజలంతా సంతోషించారు. మ్యాజిక్‌ డ్రైన్ల ద్వారా ఎక్కడికక్కడ గోతుల్లో నీరు ఇంకిపోతుందంటే ఆనందించారు. తీరా అస్తవ్యస్త పనులు గ్రామస్తులకు నరకం చూపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయంతో కాంట్రాక్టర్లు మారి, అడ్డుసుడి పనులు చేశారు. వీధులు పొడువునా ఇళ్ల ముందు కాలువల కోసం మెట్లు తవ్వి వదిలేసిన గొయ్యిలే. తలుపులు, చెక్కలను రహదారి మార్గంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కాలువల్లో ఇసుక, చిప్స్‌, చిన్న రాళ్లు మూడు దశల్లో వేసి, కొన్ని చోట్ల ఇంకుడు గుంతల మాదిరి గోతులు తీశారు. వర్షం, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోవడం దీన్ని ప్రధాన ఉద్దేశం. పనుల కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధుల స్వార్థం, అరకొర.. అస్తవ్యస్త పనులు, అధికారుల అలసత్వం, స్థానికుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం కొరవడటంతో కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయి.

అడుగు పెట్టలేని దుస్థితి

కాలువలు, రోడ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇటీవల వేసిన మ్యాజిక్‌ డ్రైన్ల నుంచి వర్షం నీరు ఇంకకపోగా.. రోజుల తరబడి నిల్వ ఉండి, రహదారులపైకి వస్తోంది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ డ్రైన్లను అధికారులు మరలా తవ్వేశారు. కాపువీధి, ఎస్సీవీధి, కూరాకులవీధి, దత్తివీధి, ప్రధాన రహదారి, బంకురువీధి, వెలమవీధి.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భారీ గోతులు, పిక్క, ఇసుక నిల్వలు, రాళ్లతో నిండిన రహదారులు.. ఇవే దృశ్యాలు ఊరంతా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లు దిగువకు ఉండటం వల్ల వర్షం కురిసిందంటే చాలు.. కాలువలు, రహదారిపై నీరంతా వారి ఇళ్లల్లోకి చేరుతోంది. వాటిని తోడుకుంటూ రాత్రంతా జాగారమే అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనుల వల్ల రూ.కోట్ల నిధులు బుగ్గిపాలు అయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు.

తిట్టిపోస్తున్న పెదపెంకి వాసులు

మ్యాజిక్‌ డ్రెయిన్ల పేరిట ఊరంతా ఎక్కడికక్కడ సమస్యలు

నెలలు గడుస్తున్నా తీరని

ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement