సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో ఇరువురి మధ్య అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. జిల్లా మంత్రి సమక్షంలోనే ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పెద్ద కేకలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఐఏఎస్ అధికారి అన్న కనీస మర్యాద మరిచి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర.. కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆరోపణలకు దిగారు. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ, జిల్లా అధికారుల ముందటే ఆయన్ను అగౌరవపరిచారు. దీన్ని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దీటుగా తిప్పికొట్టారు. మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై బుధవారం పార్వతీపురం మన్యం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్‌చంద్రతో పాటు.. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇతర జిల్లా అధికారులంతా హాజరయ్యారు. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ, ఉద్యానవన, మహిళా సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో బలిజిపేట మండలం పెదపెంకి రోడ్ల కాంట్రాక్టు విషయంలో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర లేవనెత్తారు. డ్రైనేజీ, ఆక్రమణల తొలగింపు వ్యవహారంతో పాటు.. కాంట్రాక్టరును మార్చడంపైనా ప్రశ్నించారు. అధికారుల తీరును.. ముఖ్యంగా కలెక్టరు ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కలెక్టరు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేయడం సరైంది కాదని బదులిచ్చారు. నిబంధనలు, చట్టం ప్రకారం తాము కూడా పని చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. శ్రీమీకు ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించండి. రోడ్డును ఆక్రమించకుంటే కొట్టకూడదు. చెరువును కబ్జా చేస్తే తొలగించకూడదు. వారికి మీరే హామీ ఇచ్చేస్తారు. తిరిగి మమ్మల్నే అంటారు. మేం చట్టప్రకారం చేస్తున్నామా, లేదా? చట్ట ప్రకారం పని చేస్తున్నామా, లేదా? వ్యక్తిగత అంశాలను ఇక్కడ తీసుకురాకూడదు. అధికారుల మీద ఎప్పుడూ పడతారెందుకు?శ్రీ అంటూ కలెక్టరు గట్టిగా సమాధానమిచ్చారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రి సంధ్యారాణి సముదాయించే ప్రయత్నం చేశారు. శ్రీఒక కలెక్టరు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఒక మంత్రి ఉన్నా.. చూడరా? మీకు ఏమైనా సమస్యలుంటే ఛాంబరులో కూర్చొని ఇలాంటివి మాట్లాడుకోండి.శ్రీ అని హితవు పలికారు.
లేనిపోని వార్తలు ప్రసారం చేసే
దుర్మార్గులుంటారు జాగ్రత్త : కలెక్టర్
ఈ వివాదం సద్దుమణిగాక, జిల్లా అధికారులనుద్దేశించి మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేమ్ చేద్దామని, దాని ద్వారా తృప్తి చెందుదామని, ఇష్టానుసారం మీడియా ద్వారా వార్తలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బు వార్తలు రాయించుకుని, తనను బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు, ఆడియోలు చేయడం, ఆడియో రికార్డులు, లేనిపోనివి ప్రచారం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు దుర్మార్గులు. ఫేక్ న్యూస్ అయితే ఫేక్ అని ఖండించండి. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. సైబర్ క్రైం కూడా ఉంది. మీ శాఖల పరంగా ఏ విధంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చినా సహించవద్దు. ఫేక్ న్యూస్ ఏ రకంగా వచ్చినా ఊరుకునేది లేదు. ఖండించండి.’ అని అధికారులకు సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే విజయ్‌చంద్రను ఉద్దేశించే కలెక్టర్ చేశారని అర్థమవుతోంది.
రోడ్డు పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం
రోడ్డు పనుల జాప్యంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతి 15 రోజులకోసారి చెబుతున్నానని, అయినా పట్టించుకోరా? అని అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తరా్వాత టెండరు అయిన సాలూరు–మక్కువ రోడ్డు తన నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కాంట్రాక్టర్లతో ఎందుకు మొహమాటమని ప్రశ్నించారు. బాగువలస నుంచి మక్కువ రహదారిని నేటికీ ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టరుకు సూచించారు. ఏ రోడ్డు అయినా ఏడాది దాటినా ప్రారంభించకపోతే టెండరును రద్దు చేయాలని స్పష్టం చేశారు.
మంత్రి సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం
వ్యక్తిగత అంశాలతో కలెక్టర్‌ను
ఇరికించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే విజయ్‌చంద్ర
గట్టిగా బదులిచ్చిన కలెక్టర్
చట్టప్రకారం చర్య తీసుకుంటే
అడ్డుపడతారా?
మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని ఎమ్మెల్యేను
హెచ్చరించిన కలెక్టర్


