జీతం ఒక చోట..
● నాయకుల సిఫార్సుతో వైద్యుల డిప్యుటేషన్‌లు
● మందంగించిన వైద్యసేవలు
● అవస్థలు పడుతున్న రోగులు
పాలకొండ ఏరియా ఆస్పత్రి
పాలకొండ: పోస్టింగ్ ఇక్కడ..జీతం ఇక్కడే. విధులు మాత్రం వారికి నచ్చిన చోట..రికార్డుల్లో ఇక్కడ వైద్యులు ఉంటారు.సేవలు అందించడానికి మాత్రం ఉండరు.. కూటమి నాయకుల అండదండలు వారికి పుష్కలం. ఉన్నతాధికారుల అధికారాలు వారి లాబీయింగ్ ముందు పనిచేయవు. ఎందుకు అంటే వారికి అధికార పార్టీ పెద్దల అండ ఉంది. ఇది ప్రస్తుతం పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దుస్థితి. డివిజన్ కేంద్రం, ఏజెన్సీ ముఖ ద్వారంలో ఉండే పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి రాజకీయ రంగుతో వైద్యసేవలు మందగించాయి. వాస్తవానికి ఈ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువ. అందులోనూ సాధారణ వ్యాధులతో వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రికార్డుల్లో ఇక్కడ వైద్యుల పోస్టులు మంజూరు చేశారు. రికార్డుల్లో 23 మంది వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారు. పనిచేయడానికి మాత్రం అంతమంది లేరు.
వారి తీరే వేరు..
ఆస్పత్రి వైద్యుల్లో ఇక్కడ అత్యంత అవసరమైన జరనల్ ఫిజీజిషియన్ పోస్టులు రెండు ఉన్నాయి. రోగుల సంఖ్య ఆధారంగా ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సిన మేరకు నియమించారు. ఎం.డి జనరల్ ఫిజీషి యన్‌గా కె.మోహన్‌బాబు, రాజేశ్వరిలు ఇక్కడ రికా ర్డుల్లో పనిచేస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు ఇక్కడ విధుల్లో చేరిన వెంటనే పలాస సీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయింది. రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇక్కడి అవస్థల నేపథ్యంలో ఆయన డిప్యుటేషన్ రద్దు చేయాలని ఉన్నతాధికారులు సిపార్స్ చేశారు. దీంతో 15రోజుల కిందట ఆయన విధుల్లో చేరి ఆదే రోజు సెలవు పెట్టి అవరావతి వెళ్లి తిరిగి డిప్యుటేషన్ కంటిన్యూ చేసుకున్నారు. ఆయనకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు నోరు మెదపడం లేదు. మరో జనరల్ ఫిజీషియన్ రాజేశ్వరి మెటర్నిటీ (ప్రసూతి) సెలవులో ఉన్నారు. దీంతో ఇక్కడ ఆస్పత్రిలో జనరల్ ఫిజీ షియన్ పూర్తిగా లేరు. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న జనరల్ ఫిజీషియన్‌లు ఇక్కడికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నా పోస్టులు ఖాళీగా లేవు. మరో వైద్యుడు ఉదయ్ కిరణ్ పక్క నియోజవర్గం ఎమ్మెల్యే సిఫార్స్‌తో రణస్థలం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రిలో సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులను శ్రీకాకుళం తరలించడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆస్పత్రిలో వైద్యుల డిప్యుటేషన్‌లపై డీసీహెచ్‌స్ నాగభూషణ రావు వద్ద ప్రస్తావించగా ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. అక్కడి నుంచి డిప్యుటేషన్ ల రద్దుకు ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. పాలకొండ నుంచి ఎక్కువగా శ్రీకాకుళం ఆస్పత్రికి రోగులను తరలించడంపై ప్రస్తావించగా సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం అందిస్తున్నామని పరిస్థితిని పరిశీలించి రిపర్ చేస్తున్నామన్నారు. వైద్యుల కొరత కారణంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని వివరించారు.
– నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్


