పెద్దగెడ్డపై..పచ్చని సంతకం | - | Sakshi
Sakshi News home page

పెద్దగెడ్డపై..పచ్చని సంతకం

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

కరువు నేలలకు సాగునీటి వరం

12 వేల ఎకరాల్లో పచ్చని పంటలు

వైఎస్‌ఆర్‌ చొరవతో రూపుదిద్దుకున్న

పెద్దగెడ్డ జలాశయం

పాచిపెంట: ఒకప్పుడు కరువుతో అల్లాడిన ప్రాంతం..చుక్క నీటి కోసం ఎదురుచూసిన భూములు..నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం పెద్దగెడ్డ జలాశయం. దివంగిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో వేగావతి నదిపై పాచిపెంట వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ప్రతిపాదనల దశలో ఉన్న పెద్దగెడ్డ ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేసి..పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. 2006 సెప్టెంబర్‌ 26న ప్రాజెక్టును రైతులకు అంకితం చేశారు. అప్పటి నుంచి పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

బీడు భూములకు సాగునీటి భరోసా..

పెద్దగెడ్డ జలాశయం అందుబాటులోకి రావడంతో గతంలో పూర్తిగా వర్షాధారంగా ఉన్న అనేక భూములు సాగులోకి వచ్చాయి. మెట్ట పంటలపైనే ఆధారపడిన రైతులకు సాగునీటి భరోసా లభించింది. ఒకప్పుడు బీడుగా కనిపించిన భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీరు అందుబాటులోకి రావడంతో పంటల సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా.. రైతుల ఆర్థిక పరిస్థితుల్లోనూ కొంతమేర మార్పు వచ్చింది. వ్యవసాయంపై నమ్మకం పెరిగి..ఎన్నో కుటుంబాలకు పెద్దగెడ్డ జలాశయం జీవనాధారంగా మారింది. అందుకే స్థానికులు ఈ ప్రాజెక్టును ‘వైఎస్‌ఆర్‌’ మానసపుత్రిక‘గా గుర్తు చేసుకుంటున్నారు.

రైతుల గుండెల్లో చెరగని సంతకం..

వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా పెద్దగెడ్డ పరిసర ప్రాంత రైతులు ఆయనను స్మరించుకుంటున్నారు. తమ పొలాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతుల జీవితాల్లో వచ్చిన మార్పు నేటికీ ప్రతీకగా నిలుస్తోంది. కరువు నేలలకు సాగునీటిని అందించి..పచ్చని పంటలకు బాటలు వేసిన పెద్దగెడ్డ..రైతుల జీవితాల్లో చెరగని సంతకంగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement