విజయనగరం: జిల్లా కేంద్రంతో పాటు గజపతినగరం ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో నిషేధిత ఇంగువ పొడి నిల్వలు బట్టబయలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్. ఈశ్వరి పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పి.శ్రీను, పి.వెంకట రమణలు రెండు ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనల ప్రకారం నిషేధిత ఇంగువ పొడి నిల్వలను గుర్తించారు. వాటి విక్రయాలు, పంపిణీని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేయాలని వ్యాపారులను ఆదేశించారు. సంబంధిత ఇంగువ పొడి నమూనాలను సేకరించి, నాణ్యతా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.


