పార్వతీపురం రూరల్: చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి మగ్గుతున్న తమను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాస్పత్రిలోని కాంట్రాక్ట్ నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా, మంగళవారం ఆస్పత్రి ఆవరణలో 11వ రోజు నిరసన గళం విప్పారు. శాంతియుత దీక్షను కొనసాగిస్తూనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ముమ్మరంగా సంతకాల సేకరణ చేపట్టారు. అరకొర వేతనాలతో అష్టకష్టాలు పడుతున్న కాంట్రాక్టు సిబ్బందిని తక్షణమే క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని వారు ముక్తకంఠంతో నినదించారు. ఏళ్లుగా సేవలందిస్తున్నా తమ జీవితాల్లో ఎలాంటి వెలుగులూ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆస్పత్రిలో విధులను సైతం బహిష్కరించి తీవ్రస్థాయిలో పోరుబాట పడతామని కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందే
లేదంటే విధుల
బహిష్కరణ
11వ రోజుకు చేరిన నర్సింగ్,
పారామెడికల్
సిబ్బంది ఆందోళన


