● మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
జియ్యమ్మవలస రూరల్: విశాఖ జిల్లా మారికవలసలోని గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాల (స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) తరలింపును వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నాయకులను అరెస్టుచేసి ఉద్యమాన్ని ఆపలేరని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజు స్పష్టంచేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న నాయకులను విశాఖ పోలీసుల అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మారికవలసలో స్కూల్ తరలింపును అడ్డుకుంటున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ నేతల ఎప్పుడూ అండగా ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఆందోళనలో ఉన్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లడం కూడా తప్పా? అంటూ పోలీసులను ప్రశ్నించారు. విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తూ అప్పులు ఊబిలో ముంచేసిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే సమయం అతి దగ్గరలో ఉందన్నారు.


