పార్వతీపురం:రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు పని చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఖరీఫ్ సాగు, పంట ఆరోగ్య సర్వే, ఎరువుల లభ్యత, నాణ్యత నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో 88,858 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 74,757 హెక్టార్లలో సాగు పూర్తయిందన్నారు. మిగిలిన పంట ఆరోగ్య సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని తెలిపారు. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 21 రైతు గ్రూపులకు కిసాన్ డ్రోన్లు కేటాయించిన ట్లు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి. జిల్లా వ్యవసాయాధికారి భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన శాఖలు ప్రగతి సాధించాలి
ప్రగతిలో వెనుకబడిన శాఖలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో 26 శాఖల ప్రగతిని సమీక్షించారు. గ్రామీణ మండల స్థాయిలో వెనుకబడిన సూచికలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నిధులు, సాంకేతిక సమస్యలతో పనులు నిలిచిపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
గృహాల నిర్మాణం వేగవంతం చేయాలి
పీఎం జన్‌మన్‌తోపాటు ఇతర ప్రభుత్వ గృహల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారుకు పథకాల ప్రయోజనాలు అందేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. గృహ లబ్ధిదారులకు వీబీజీరామ్‌జీ పథకం కింద 90 రోజుల వరకు పనులు కల్పించాలని, ఎస్‌హెచ్‌జీలద్వారా బ్యాంకు రుణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు నోడల్ అధికారులుగా వ్యవహరించి గృహ నిర్మాణ పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.


