● సైబర్ వలలో చిక్కి మోసపోయిన రాజాం వాసి ● రూ.18లక్షలు పోగొట్టుకున్న వైనం ● లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
రాజాం సిటీ:
ప్రజల అవసరాలను, బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మాయల వల విసురుతున్నారు. పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అత్యాశతో సైబర్‌వలకు చిక్కి లక్షల్లో నగదు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రాజాంలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ.18లక్షలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు. టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గాడి సతీష్ కొంతకాలంగా రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో నివసిస్తున్నాడు. సతీష్‌కు మూడు నెలల కిందట పోస్టులో మీకు షో ప్రైజ్ కార్డు వచ్చింది.. ఆ కార్డును గీసి చూడగా అందులో రూ.24లక్షలు బహుమతి వచ్చిందని, అలాగే, 82820 22714 అనే వాట్సాప్ నంబర్ వివరాలు ఉన్నాయని తెలిపాడు. ఆ నంబర్‌కు ప్రైజ్‌కార్డు వివరాలు వాట్సాప్ చేయగా సైబర్ మోసగాడు ఫోన్‌చేసి మీరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారని తెలిపాడు. ఆ ప్రైజ్ మనీ పొందాలంటే ఆధార్ కార్డు, పాన్, బ్యాంకు వివరాలు పంపాలని కోరాడు. వెంటనే వాటిని పంపించడంతో మళ్లీ ఫోన్ చేసి మొదటిగా రూ.9,600లు యూనియన్ బ్యాంకులో కట్టాలని చెప్పడంతో చెల్లించారు. మళ్లీ సైబర్ మోసగాడు ఇండియన్ బ్యాంకు ఖాతా నంబర్ 83015 76712 ఐఎఫ్‌ఎస్‌సీ ఐపీఐబీ000బి080కు రూ.16,500లు చెల్లించాలని సూచించడంతో ఆ మొత్తాన్ని కూడా చెల్లించామని బాధితుడు తెలిపాడు. తరువాత జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఇతర రుసుముల పేరుతో మరింత నగదు చెల్లించాలని చెప్పడంతో ఆ మాటలు నమ్మిన బాధితుడు ఫోన్‌పేలో నగదు చెల్లించాడు. మీ బహుమతి డబ్బులు డబుల్ అయ్యిందని చెప్పి డబ్బులు కట్టాలని నమ్మించాడు. నాన్ ట్యాక్స్‌ల కోసం రూ.62,400లు కట్టాలని చెప్పారు. మీకు వచ్చిన నగదు బహుమతి మొత్తం ఇప్పిస్తానని ఆశచూపి దఫదఫాలుగా ఏకంగా రూ.18లక్షలు వరకు బాధితుడి నుంచి వసూలు చేసి మోసం చేశారు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో సైబర్ మోసగాడి నుంచి స్పందన కరువైంది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


