వారు చెబితే ఒకే..! | - | Sakshi
Sakshi News home page

వారు చెబితే ఒకే..!

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

ఏజెంట్లకు నో ఎంట్రెన్స్‌..

రవాణాశాఖలో అన్ని సేవలు ఆన్‌లైన్‌ చేయడం జరిగింది. ఏజెంట్లను కార్యాలయంలోకి రానివ్వడం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– మణికుమార్‌, డిప్యూటీ ట్రాన్సఫోర్ట్‌ కమిషనర్‌

విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం మండలానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి రవాణా శాఖలో లైసెన్స్‌ కోసం నేరుగా వెళితే టెస్ట్‌ ఫెయిల్‌ అయ్యాడు. వారం రోజుల తర్వాత ఏజెంట్‌ ద్వారా వెళితే డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసయ్యాడు. ఇందుకు గాను సదరు ఏజెంట్‌కు రూ.5 వేలు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే గంట్యాడ మండలానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం రవాణశాఖకు నేరుగా వెళ్లాడు. దీంతో అతను కూడా టెస్ట్‌ ఫెయిలయ్యాడు. వారం రోజుల తర్వాత ఓ ఏజెంట్‌ ద్వారా వెళితే ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ పాసయ్యాడు. ఇందుకు గాను ఏజెంట్‌కు రూ.1000 ఇచ్చినట్లు సమాచారం. రవాణశాఖలో నిత్యం ఇదే తంతు జరుగుతుందని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఏ పని కావాలన్నా ఏజెంట్ల ద్వారా వస్తేనే జరుగుతుంది. లేదంటే సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. రవాణశాఖలో అన్ని సేవలు అన్‌లైన్‌ చేసేశామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ అనేది పేరుకే తప్ప పైసలు ఇవ్వనిదే ఇక్కడ ఏ పనీ జరగదనేది బహిరంగ సత్యం.

నేరుగా వెళితే కష్టమే..!

రవాణాశాఖ కార్యాలయంలో ఏ పని కోసం నేరుగా వెళ్లినా జరగడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్‌ ద్వారా వెళితే మాత్రం చాలా సులువుగా పని పూర్తవుతుంది. ఇక్కడి కార్యాలయంలో ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్‌ లైసెన్సులు, పర్మిట్‌లు , రిలీవింగ్‌ ఆర్డర్స్‌ జారీ, తదితర సేవలు అందుతున్నాయి.

అధిక మొత్తంలో ఫీజులు వసూలు..

ఎల్‌ఎల్‌ఆర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి వాటికి వాహనదారుల నుంచి ఏజెంట్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. వాహనదారులు నుంచి వసూళ్లు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని ప్రతిరోజూ ఏజెంట్లు అధికారులకు ఇస్తుంటారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు నిబంధనల ప్రకారం టూ వీలర్‌కు అయితే రూ. 300 , ఫోర్‌ వీలర్‌కు రూ. 360 వాహనదారుడు చెల్లించాలి. అయితే ఏజెంట్లు టూ వీలర్‌ ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ. 800 నుంచి రూ. 1000 , ఫోర్‌ వీలర్‌కు అయితే రూ. 1000 నుంచి 1200 రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా టూవీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు రూ. 900, ఫోర్‌ వీలర్‌కు రూ.1260 చెల్లించాలి. కాని టూవీలర్‌కు రూ. 4 వేలు, ఫోర్‌ వీలర్‌ అయితే రూ. 5 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలకు రీలివింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడానికి కూడ రూ.2 వేల నుంచి 4 వేల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా వెళ్లే ఫైళ్లపై ప్రత్యేక కోడ్‌ రాస్తారు. ఈ కోడ్‌ ఉంటే రవాణా శాఖాధికారులు త్వరగా పని చేస్తారు. లేదంటే లేనిపోని కొర్రీలు వేసి ఫెయిల్‌ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏజెంట్ల బెడద నుంచి తమను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

రవాణశాఖలో ఏజెంట్లదే రాజ్యం

ఎల్‌ఎల్‌ఆర్‌, లైసెన్స్‌లకు భారీగా వసూళ్లు

ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ. 1000, లైసెన్స్‌కు రూ. 4 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణులు

వెహికల్‌ రిలీవింగ్‌ ఆర్డర్స్‌కు కూడా డబ్బులు వసూలు వేస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement