న్యూస్‌రీల్
●సాలూరుకు చెందిన రమాదేవి శ్రావణ మాసం పూజలు నేపథ్యంలో ఏటా
ఓ 50 మందికి భోజనాలు పెట్టడం
ఆనవాయితీగా పెట్టుకున్నారు.
గత ఏడాది ఖర్చు చేసిన బడ్జెట్‌తో పోల్చుకుంటే.. ఈ సారి అదనంగా
రూ.8 వేల వరకూ అవుతోంది. దీంతో పదార్థాలు తగ్గించుకోవడంతో పాటు..
భోజనాల సంఖ్యను కూడా
కుదించుకోవాల్సి వచ్చిందని
ఆమె చెబుతున్నారు.
●పార్వతీపురానికి చెందిన ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి. నలుగురు కుటుంబ సభ్యులున్న ఆయన ఇంటికి.. నిత్యావసర సరకుల కోసం నెలవారీ వ్యయం
గతంలో రూ.5,500 నుంచి రూ.6 వేలు అయ్యేది. ఇది కాక, కూరగాయలు వంటివి అదనం. రెండు నెలలుగా కేవలం కిరాణా సామగ్రి కోసమే అదనంగా మరో రూ.2 వేల వరకూ పెరిగింది. కూరగాయలు కలుపుకొని వెళ్తే.. అదనంగా మరో రూ.వెయ్యి పెరిగింది. నెలవారీ నిత్యావసరాల ఖర్చులే రూ.8,500 నుంచి రూ.9 వేలు అవుతోందని
ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఎల్‌నినోతో వర్షాభావం.. సాకుగా చూపుతూ ధరలను పెంచేస్తున్నారు. దీనివల్ల మధ్య తరగతి ప్రజల వంటింట్లో సెగలు పుడుతున్నాయి. జూన్ నుంచి మొదలైన ధరల మంట.. ఆగస్టు నెలలో మరింత మండుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వివిధ పంటల ఉత్పత్తులు తగ్గిపోయాయి. సరఫరా పడిపోయింది. మరోవైపు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమై.. మధ్యతరగతి, పేద కుటుంబాలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పాలు పాకెట్ చిన్నది రూ.13 నుంచి రూ.15 అయింది. బియ్యం మీద బస్తాకు రూ.200 పెరిగింది.. ఆయిల్ లీటరుపై రూ.20 వరకూ పెరిగి రూ.180 అయ్యింది. పప్పులపై రూ.250 నుంచి రూ.350 వరకు అదనపు భారం పడుతోంది. పంచదార ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చక్కెర దాదాపు రూ.65–70కి చేరింది. కిలో ఉల్లి ధర రూ.60–65కు చేరింది. కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులన్నీ కలుపుకొంటే నెలవారీ బడ్జెట్ మీద రూ.3 వేల వరకు అదనపు వడ్డన పడుతోందని మధ్య తరగతి గృహిణి మహాలక్ష్మి చెబుతున్నారు. గ్యాస్, పెట్రోలు కలిపి లెక్కిస్తే మరో రూ.వెయ్యి వరకూ అదనంగా బడ్జెట్ లెక్క వేసుకుంటున్నామని అంటున్నారు. ప్రాంతాన్నిబట్టి ఒక్కో నిత్యావసర వస్తువు ధర కేజీకి రూ.10 నుంచి రూ.60 వరకు పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
తీవ్రమైన వాతావరణ మార్పులు, వర్షాభావం వల్ల వరి, వ్యవసాయ దిగుబడులు భారీగా పడిపోవడం, ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం, డిమాండ్ కు తగినట్లు సరఫరా లేకపోవడం, రవాణా వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల వ్యత్యాసాలు ప్రధాన కారణం అవుతున్నాయి. విపరీతమైన ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులను ఆదుకోవాలని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ధరల నియంత్రణ కమిటీ సమావేశమవ్వాలి. ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించి కృత్రిమ కొరతను నిలువరించాలి. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేలా చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఆ కమిటీ జాడ ఎక్కడా కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుల కష్టాలను పట్టించుకోవడమే మానేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


