గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చేంతవరకు పోరాడతాం
జీఓ నంబర్ 3 అమలుకు డిమాండ్
కురుపాం: అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ నంబర్ 3ను అమలు చేస్తామని చెప్పారు... రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబు సర్కా రు తీరుపై గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. 1/70 రద్దుచేస్తే గిరిజన భూములకు రక్షణ ఉండదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కురుపాంలో గురువారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా నినదించారు. గిరిజన గ్రామాలన్నింటినీ ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని రాజ్యాంగంలో పొందుపరిచినా జాప్యం చేయడం తగదన్నారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మండంగి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నంబర్ 3ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరారు. ఎన్నికల్లో మభ్యపెట్టి, ఇప్పుడు జీఓ 3వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయంటూ మంత్రి సంధ్యారాణి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు జీఓ నంబర్ 3 గురించి అవగాహన లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మడంగి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కోరంగి సీతారాం, పువ్వల తిరుపతిరావు, బిడ్డిక ప్రకాశరావు, ఐద్వా నాయకులు బిడ్డిక చామంతి, గిరిజన సమాఖ్య నాయకుడు పువ్వల ప్రసాద్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రంజిత్‌కుమార్, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు బిడ్డక శంకరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.నాయుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కె.గౌరీశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనీల్, కుమార్, ఆదివాసీ గిరిజన సమాఖ్య నాయకులు కొండవాడ ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


