● చెరువుగర్భాల్లో అక్రమ మట్టి తవ్వకాలు ● రియల్ వెంచర్‌కు తరలింపు ● రోడ్లను సైతం వెంచర్‌లో కలిపేసిన వైనం ● అధికారుల హెచ్చరికలూ భేఖాతర్.. ● రియల్టర్ ఆగడాలపై జనం మండిపాటు
ఈ చిత్రం చూశారా... పాచిపెంట మండలం కర్రివలస రెవెన్యూ పరిధిలోని చెరువులో పొక్లెయిన్‌తో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నది ఓ రియల్టర్. పోతులగెడ్డ సమీపంలో వేసిన రియల్ వెంచర్ కోసం అవసరమైన మట్టిని ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చెరువు గర్భాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసి తరలిస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు ఓ సారి హెచ్చరికలు చేశారు. వాటిని పట్టించుకోకుండా బుధవారం ఇదిగో ఇలా మట్టితవ్వకాలు ఆరంభించారు.
పాచిపెంట: ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారుల పరిరక్షణకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు విపినిస్తున్నాయి. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూముల్లో లేఅవుట్ వేస్తున్న రియల్టర్... దానికి అవసరమైన మట్టిని పాచిపెంట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కర్రివలస రెవెన్యూ పరిధిలోని చెరువు గర్భాన్ని పొక్లెయిన్‌తో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ తవ్వకా లు మాత్రం ఆపకపోవడం గమనార్హం. చెరువు నుంచి యథావిధిగా మట్టి తరలిస్తూ లేఅవుట్‌లో వినియోగిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరేనా?
రియల్టర్ బరితెగించిన తీరుపై అధికారుల సమాచారంతో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పందించారు. రోడ్డు ఆక్రమణలు, చెరువులో మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని జేసీ, ఆర్డీఓల కు స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినట్టు స మాచారం. అయితే, రియల్టర్ ఆగడాల ముందు కలెక్టర్ ఆదేశాలు పనిచేయడంలేదన్న వాదన వినిపిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలు ఆపకపోవడం, రోడ్డు ఆక్రమణలు తొలగించకపోవడం, అధికారుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా యథేచ్ఛగా పనులు కొనసాగిస్తుండడంతో.. సంబంధిత అధికారులు చేతకానివారనే ధీమాతోనే వ్యాపారి వ్యవహరిస్తున్నారా? లేక తన అక్రమాలను అడ్డుకునే శక్తి అధికారులకు లేదని భావిస్తున్నారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమవుతారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు చూశారా... ఇది లేఅవుట్ ఎదురుగా పిండ్రింగివలస గ్రామానికి వెళ్లే ప్రభుత్వ రహదారి. పాత ప్రభుత్వ రహదారిని లేఅవుట్‌లో కలిపేసిన రియల్టర్... గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలంలో మరో రహదారిని ఏర్పాటుచేయడం గమనార్హం. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్, ఆర్‌ఐలు స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించి పాత రహదారిని యథావిధిగా కొనసాగించాలని, ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ ఆక్రమణను తొలగించకపోగా.. ఆక్రమణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరోచోటకు తరలించే ప్రయత్నాలు చేయడం గమనార్హం.


