గిరిజన సంఘాల ఆధ్వర్యంలో.... ఘనంగా ఆదివాసీ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో.... ఘనంగా ఆదివాసీ దినోత్సవం

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

సీతంపేట: ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్యపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి బిడ్డిక తేజేశ్వరరావు, స్థానిక జేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సీతంపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. దోనుబాయి రోడ్డు కూడలి నుంచి ఐటీడీఏ వరకు ప్రదర్శనగా వెళ్లారు. సందెమ్మతల్లి వద్ద పూజలు చేశారు. అనంతరం ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న ఆదివాసీ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. డప్పులు, వాయిద్యాలు, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కొందరు కోర్టులకు వెళ్లి సవాల్‌ చేసి కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల రిజర్వేషన్‌లను కూడా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వాటిని తరిమి కొట్టడానికి బిర్సాముండా, కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రేపటి తరం కోసం ప్రతీ ఆదివాసీ కూడా ఐక్యతతో ముందుకు వెళ్లాలన్నారు. జీవో నంబర్‌ 3కిబదులు ప్రత్యేక చట్టం చేయాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ నాయకులమీద సోషల్‌మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిని జాతిద్రోహులుగా గుర్తిస్తామని ప్రకటించారు.

ఐటీడీఏ ఆదివాసీ దినోత్సవాన్ని

బహిష్కరిస్తాం

ఈనెల 11న ఐటీడీఏ అధికారులు ఐటీడీఏలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజనులమంతా బహిష్కరిస్తామని నాయకులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజున నిర్వహించే కార్యక్రమాన్ని ఐటీడీఏ పరిధిలో మాత్రం తేదీ మార్చి జరపడం సమంజసం కాదన్నారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇలా వాయిదా వేసి గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రానున్న రోజుల్లో ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కుండంగి సరస్వతి, ఆదివాసీ ఐక్యవేదిక న్యాయ సలహాదారు ఆరిక మన్మథరావు, నిమ్మక కాంతారావు, బిడ్డిక ఉమామహేశ్వరరావు, ఎస్‌.చిరంజీవులు, ఎస్‌.సాయికుమార్‌, ఎస్‌.రాము, ఎం.రవికుమార్‌, ఎం.శ్యాం, సూరిబాబు, హెచ్‌.మోహన్‌రావు, కె.సుబ్బారావు, కె.కాంతారావు, హరిప్రసాద్‌, జె.రామకృష్ణ, సురేష్‌, ఎం.భాస్కరరావు,బి.రామ్మోహన్‌రావు, వినోద్‌, ఎస్‌.గంగారావు, కె.వెంకునాయుడు, రామస్వామి, హెచ్‌.అదిలక్ష్మి, ఎ.కళావతి, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురంలో..

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన నాయకులంతా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈమేరకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజనులతో కలిసి స్థానిక వైటీసీ నుంచి గుమ్మలక్ష్మీపురం గ్రామం వరకు జై ఆదివాసీ..జైజే ఆదివాసీ.. అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైటీసీలో గిరిజన ఉత్సవం నిర్వహించారు. పలువురు విద్యార్థులు, గిరిజన యువత గిరిజన సంప్రదాయ వేషధారణలతో అలరించారు. డప్పువాయిద్యాలు వాయిస్తూ..నృత్యాలు చేస్తూ సంప్రదాయాల్ని చాటిచెప్పారు. గిరిజనులంతా ఐక్యంగా ఉండాలంటూ ఈ సందర్భంగా వక్తలైన నాయకులు గిరిజన సమాజానికి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement