కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్‌

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు సెల్లార్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల నమోదు, అర్జీల స్థితికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్‌ చేయవచ్చునని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌

పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ప్రజల ఫీడ్‌బ్యాక్‌ సేకరణ కోసం క్యూఆర్‌ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్‌ ద్వారా స్కాన్‌చేసి సేవలపై అభిప్రాయాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోర్డులు దెబ్బతిన్నా వెంటనే మార్చాలని, ఈ విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

గుండెపోటుతో సీపీఎం నేత మృతి

సీతంపేట: సీపీఎం సీనియర్‌ నాయకుడు, గిరిజన సంఘం నేత బిడ్డిక అప్పారావు (56) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సీతంపేటలో శనివారం జరిగిన మన్యం బంద్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామమైన చిన్నకంబలో ఆదివారం గుండెపోటు రావడం, క్షణాల్లోనే మృతిచెందడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. దశాబ్దాల తరబడి ఉద్యమబాటలో నడిచి మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి తీరని లోటని సీపీఎం, గిరిజన సంఘాలు, ప్రజా, ఉద్యోగుల సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీ శంకర్‌

పాచిపెంట: ఎరువుల విక్రయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణాల యజమానులను పార్వతీపురం జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీ శంకర్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పాచిపెంట మండలకేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల లైసెన్సులు, స్టాక్‌ రిజిస్టర్లు, స్టాక్‌ బోర్డులను పరిశీలించారు. రైతులకు నిబంధనల మేరకు ఎరువులను విక్రయించాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడరాదని డీలర్లకు సూచించారు. ముఖ్యంగా రైతులకు బలవంతంగా లింక్‌డ్‌ ప్రొడక్టులను అంటగట్టరాదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ–పంట నమోదు, ఏపీ ఎయిమ్స్‌ 2.0 యాప్‌లో క్రాప్‌ మానిటరింగ్‌, ఎవల్యూషన్‌న్‌ను పరిశీలించారు. ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ పట్టా రైతులకు ఫార్మర్‌ ఐడీ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏ ఈఓ చింతాడ గణేష్‌, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

శాకంబరీ అలంకరణలో కామాక్షి అమ్మవారు

పాచిపెంట: సాలూరు పట్టణంలో వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారు శాకంబరీ అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శాకంబరీ అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement