నాడు నిర్లక్ష్యంగా వదిలేసినా..
సాక్షి, పార్వతీపురం మన్యం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పూర్తి చేసుకున్న కురుపాం, భద్రగిరి ఆసుపత్రులను..రంగులు మార్చి, ప్రజా వినియోగంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాలను, కురుపాంలో 50 పడకల నూతన సీహెచ్‌సీ భవన ప్రారంభోత్సవాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం చేపట్టిన విషయం విదితమే. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆస్పత్రుల ఘనతంతా వారి ఖాతాలో వేసుకుని, మరోమారు తమ ‘క్రెడిట్ చోరీ’ బుద్ధిని బయటపెట్టుకున్నారు. వాస్తవానికి భద్రగిరి ఆస్పత్రి పరిపాలన ఆమోదం 18.11.2019లో వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా..మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హయాంలోనే రూ.8.95 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. గత ఎన్నికల సమయానికే ఆస్పత్రి భవనం పనులు దాదాపు 50 – 60శాతం పూర్తి చేశారు. కురుపాం ఆస్పత్రి అదనపు భవనాలకు సైతం 2020లో సుమారు రూ.3 కోట్ల నాబార్డు నిధులతో శంకుస్థాపన చేశారు. గత ఎన్నికలకు ముందు, 2024 సమయానికే 95 శాతం పనులు పూర్తి కాగా.. కేవలం ఎలక్ట్రికల్ వర్క్స్ మాత్రమే మిగిలాయి. అప్పట్లో భవనానికి వేసిన పచ్చ, నీలం రంగులను మార్చి.. శనివారం ప్రారంభించారు. అంటే.. దాదాపు రంగులు మార్చడానికే చంద్రబాబు ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజనులకు వైద్యసేవలు సక్రమంగా అందని పరిస్థితి. అదనపు భవనాలు పూర్తయినా, ప్రారంభించకపోవడంతో ఒకే పడకపై నలుగురు, ఐదుగురు చొప్పున రోగులను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. చికిత్స చేయలేక, పడకలు చాలక పార్వతీపురం పంపించేశారు. కురుపాం ఆస్పత్రిలో పాముకాటుకు మందు లేకపోవడంతో ఇటీవల ఓ విద్యార్థి చనిపోయాడు.
గత ప్రభుత్వానికి పేరు రాకూడదనే..
గత జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి, నాటి స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పేరు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతోనే ఇన్నాళ్లూ ఆస్పత్రి భవనాలను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ రెండు భవనాల ప్రారంభోత్సవం, గిరిజన ప్రజలు వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రెండేళ్ల కాలంలో జిల్లా పరిషత్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు పదేపదే ప్రస్తావించారు. వారి ఒత్తిడితోనే ఇన్నాళ్లకు రిబ్బను కటింగు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ భవనాల ప్రారంభోత్సవ సమయంలో కార్పొరేట్ హంగులతో నిర్మాణం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు కితాబిచ్చారు. శంకుస్థాపన, భవనం నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యిందన్న విషయాన్ని మర్చిపోయి అచ్చెన్న నిజాలు మాట్లాడేశారా? అని వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రంగులు మార్చడానికే రెండేళ్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే కురుపాం, భద్రగిరి ఆస్పత్రులు
అనుమతులు తేవడం, పూర్తి చేసింది మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
రిబ్బన్ కటింగు మాత్రం నేటి పాలకులది
కార్పొరేట్ భవన హంగులంటూ మంత్రి అచ్చెన్న కితాబు
మరోసారి చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ
భద్రగిరి ఆస్పత్రి అప్పట్లో ఒక మెడికల్ సెంటర్‌గా ఉండేది. నేరుగా సీహెచ్‌సీకి అప్‌గ్రేడ్ చేశారు. దీనివల్ల ఒక్క డాక్టరే చాలా కాలం పని చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే శాసనసభలో అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న పుష్పశ్రీవాణి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. డాక్టర్లను పెంచాలని అడిగారు. అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే జీరో వేకెన్సీ కింద మొత్తం సిబ్బందిని భర్తీ చేశారు. సుమారు ఏడుగురు వైద్యులను నియమించారు. మందులు, డాక్టర్లు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని గిరిజనులు గుర్తు చేస్తున్నారు.


