బలిజిపేట: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరగడంతో ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ర్యాలీ, ధర్నాకు అనుమతులు లేనందున హాజరవడానికి వీలులేదని వైఎస్సార్‌సీపీ బలిజిపేట మండల నాయకులకు ఆదివారం రాత్రి నోటీసులు అందించారు. సోమవారం ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారనే ముందస్తు సమాచారం ఉన్నందున శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీచేశామని పోలీస్ సిబ్బంది నాయకులకు తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీ, ధర్నాలు నిర్వహించే పక్షంలో చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు పంపించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, జెడ్పీటీసీ రవికుమార్ తెలిపారు.


